సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
posted on Jan 1, 2025 10:11AM
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేలా 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిలో 557 సర్వీసు లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.
గత ఏడాది టీజీ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా 4,484 ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండటతో ఆ సంఖ్యలు 5246 బస్సులను సంస్థ నడిపింది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, అమలాపురం, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి లకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే ఏపీ నుంచి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేవారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఆర్టీసీ తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది.