వైసీపీ ఎంపీ తండ్రిని విచారించిన సీబీఐ.. వివేకా హత్య కేసులో ట్విస్ట్ 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. రోజుకో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. రెండు రోజుల క్రితం వైఎస్ ప్యామిలీలో పెద్దగా చెప్పుకునే ప్రతాప్ రెడ్డిని విచారించింది సీబీఐ. తాజాగా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ విచారించడం కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసులో మొదటి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి.

వాచరణలో భాగంగా 72వ రోజు మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య వెనుక ఏఏ కారణాలు ఉన్నాయని అధికారులు విచారించారు. రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు మొదటగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటి సారిగా పిలిపించారు. మొదటి నుంచి భాస్కర్ రెడ్డి విచారణకు వస్తారా, రారా.. అని ప్రజలతో పాటూ వైఎస్ సునీత కూడా భావిస్తూ వచ్చారు.

వివేకా హత్య కేసులో కొన్ని రోజుల నుంచి కీలకమైన ఆధారాలు సేకరిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ కేసులో సెంట్రల్ జైల్‌లో ఉన్న అనుమానితుడు సునిల్ నుంచి, కీలక సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. సునిల్ తమ్ముడు కిరణ్ మాట్లాడుతూ సింహాన్ని సింహమే చంపుతుంది కానీ.. చిట్టెలుకలు చంపుతాయా అని వాపోయారు. ఈ కేసు వెనుక ఉన్న పెద్దవారి పేర్లను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో సీబీఐకి చెందిన మరో విచారణ బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. వీరిలో భరత్ కుమార్ సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ కు బంధువు అవుతారు. జగదీశ్వర్ రెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు.