పద్మ పురస్కారాల నామినేషన్ గడువు పెంపు
posted on Aug 29, 2020 1:00PM
భారతదేశ పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల కోసం నామినేషన్ గడువును వచ్చేనెల (సెప్టెంబర్)15వ తేదీవరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డుల కోసం నామినేషన్ ప్రక్రియను మే ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు కేంద్రానికి అందాయి. వాటిలో 6,361 దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. అయితే కరోనా విపత్కర పరిస్థితి కారణంగా చాలామంది తమ నామినేషన్లు పంపించలేకపోయారని వారందరి కోసం ముగింపు తేదీని పొడిగిస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కోంది. ఆసక్తిగల వారు తమ నామినేషన్లు, ప్రతిపాదనలు వచ్చే నెల 15వ తేదీలోగా https://padmaawards.gov.in.కు పంపవచ్చు.
కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో కృషి చేసిన వారికి 1954నుంచి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను అందిస్తుంది. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరుతో మూడు కేటగిరిలుగా ఈ అవార్డులను అందిస్తారు. ఈ పురస్కారాలకు ఎంపికైన వారిని ప్రతి ఏడాది రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు.