అంబటి రాంబాబు పదవి పీకేసిన జగన్.. సత్తెనపల్లి ఇన్ చార్జ్ గా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
posted on Jan 10, 2025 3:27PM
అంబటి రాంబాబును వైసీపీ వదిల్చేసుకుంటోందా? ఆయన సొంత నియోజకవర్గం సత్తెన పల్లి ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి అంబటిని తప్పించడం ద్వారా ఆయనకు తన స్థానం ఏమిటో చూపిందా? అంటే వైసీపీ శ్రేణులే ఔనని అంటున్నాయి. అయినదానికీ కాని దానికీ ప్రత్యర్థి పార్టీల నేతలపై మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో, అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడిపోయే అంబటి రాంబాబు ఇక సత్తెన పల్లి నియోజకవర్గ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని పార్టీ అధినేత విస్పష్టంగా చెప్పేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఉరుములేని పిడుగులా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం సత్తెన పల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని ఆ ఉత్తర్తులలో పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా అంబటికి ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పని లేనట్టేనని జగన్ చెప్పకనే చెప్పేశారని అంటున్నారు.
కంటి తుడుపు చర్యగా ఆయనకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తే ఇవ్వచ్చు కానీ, చెప్పా పెట్టకుండా నియోజకవర్గ సమన్వయకర్త పోస్టు పీకేయడం అంటే అంబటికి అవమానమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ అవమానాన్ని దిగమింగుకుని అంబటి పార్టీ తరఫున విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ తన నోటి దూల తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోవచ్చు. ఆయన మాట్లాడకపోయినా పార్టీ పట్టించుకోదు.