ఉత్తరాంధ్రలో దిక్కూమెక్కూలేని వైసీపీ
posted on Jan 10, 2025 2:35PM
కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిన వైసీపీకి ఇప్పుడు రాజకీయంగా అత్యంత సంక్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ కోసం పని చేయడానికి సీనియర్లెవరూ పెద్దగా సుముఖత చూపడం లేదు. కొత్తవారెవరూ కనీసం పార్టీ వైపు దృష్టి పెట్టడం లేదు. ఆ పార్టీ కార్యక్రమాలన్నీ పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోయిన పరిస్థితి ఉంది.
అధికారంలో ఉన్నంత కాలం అంతా మేమే అన్నట్లుగా బోర విరుచుకు తిరిగిన వైసీపీయులెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వైపీపీకి ఇప్పుడు దిక్కూమొక్కూ లేని పరిస్థితి నెలకొంది. ఇంత కాలం ఆ పార్టీలో సీనియర్ లుగా చెలామణి అయిన నేతలెవరూ కూడా పార్టీ కార్యాలయం వైపు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. పలు నియోజకవర్గాలలో పార్టీకి అసలు కోఆర్డినేటరే లేని పరిస్థితి ఉంది. ఎవరినైనా నియమించాలన్నా దొరకని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత జగన్ జిల్లాల పర్యటన వాయిదా పడటంతో సరిపోయింది కానీ, లేకుంటే ఆ పార్టీ దయనీయ స్థితి మరింతగా ప్రస్ఫుటమై ఉండేది. ఇక ఎలాంటి మార్గదర్శనం, దిశా నిర్దేశం లేకపోవడంతో ఉత్తరాంధ్రలో పార్టీ క్యాడర్ కూడా నిస్తేజంగా మారిపోయింది. ఆ పార్టీ ఇటీవల విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమం అట్లర్ ప్లాప్ కావడానికి కార్యకర్తలెవరూ ముందుకు రాకపోవడమే కారణం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గత ఏడాది జరిగిన ఎన్నికలలో విజయవాడ ఈస్ట్ నుంచి పరాజయం పాలైన తరువాత నుంచీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనా కార్యక్రమాలను పట్టించుకోవడం లేదు. నియోజకవర్గ కోఆర్డినేటర్ అయి ఉండి కూడా పార్టీకి ముఖం చాటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కోఆర్డినేటర్ ను నియమించాలని పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. కాగా వైసీపీ నాయకురాలు, జీవీఎంసీ మేయర్ గోలాగని హరి వెంకట కుమారి, మరో నేత మొల్లి అప్పారావులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవిపై కన్నేసినప్పటికీ, పార్టీ అగ్రనాయకత్వం వారి పట్ల సానుకూలంగా లేని పరిస్థితి ఉంది.
ఇక భీమిలి నియోజకవర్గానికి వస్తే అక్కడ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ అధినేత జగన్ ఆదేశించినా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తి చూపడం లేదు, తనను పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించాలని కోరుతున్నారు. పెందుర్తి కాకుంటే అనకాపల్లి అయినా ఫరవాలేదని చెబుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయనగరం జిల్లా పరిస్థితి కూడా అలాగే ఉంది. జడ్పీ చైర్మన్ S చిన్న శ్రీను ఎస్ కోట, లేదా ఎచ్చెర్ల నియోజకవర్గానిక కోఆర్డినేటర్ గా ఉండాలని ఆశపడుతుంటే.. పార్టీ అధిష్ఠానం ఏ మాత్రం స్పందించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజవకర్గాలకు సమన్వయకర్తలుగా పని చేయడానికి పార్టీ సీనియర్లెవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో అనివార్యంగా ఆ బాధ్యతలను అప్పగించడానికి పార్టీ హైకమాండ్ కొత్త ముఖాలను అన్వేషిస్తున్నది.