తెలుగు భాషా దినోత్సవం నాడే అస్తమించిన తెలుగు భాషాభిమాని

నందమూరి హరికృష్ణ ద్వితీయ వర్ధంతి నేడు. 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. తెలుగు భాషని ఎంతగానో అభిమానించే హరికృష్ణ.. తెలుగు భాషా దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం.

 

నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగువారికి పరిచయమైన హరికృష్ణ.. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. నిస్వార్ధమైన వ్యక్తిగా, చైతన్య రథసారధిగా ప్రజల హృదయాలలో శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నారు. చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ నటుడిగా ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశారు.

 

హరికృష్ణ తెలుగు భాషని ఎంతగానో అభిమానించేవారు. తెలుగు భాషపై ఆయనకు ఎంత అభిమానం ఉందో చెప్పటానికి రాజ్యసభలో ఆయన తెలుగులో మాట్లాడిన ఒక్క సంఘటన చాలు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా తెలుగులో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలకు పలువురు నవ్వుతున్నా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. 'ఇది మా మాతృభాష.. మాతృభాషలోనే మా ఆవేదన తెలియజేస్తాం' అంటూ తెలుగులోనే తన గళాన్ని వినిపించారు. అంతేకాదు, 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని గుర్తుచేస్తూ రాజ్యసభలో తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేశారు. అంతలా తెలుగు భాషని అభిమానించే ఆయన.. తెలుగు భాషా దినోత్సవం నాడే రోడ్డు ప్రమాదంలో మరణించారు.

 

హరికృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను గుర్తుచేసుకున్తున్నారు.