రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కెదురు
posted on Jan 10, 2025 10:50AM
మాజీ ఎంపీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం (జనవరి 10) కొట్టివేసింది.
రఘురామకృష్ణం రాజు హత్యకు పన్నిన కుట్రలో అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కూడా భాగస్వామి అన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ ఆరోపణలపై జీజీహెచ్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను అందజే యాల్సిందిగా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఆమె బేఖాతరు చేశారనీ, ఆస్పత్రిలోని ఇతర వైద్యులు రఘురామకు పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదికలను ఆమె తొక్కిపెట్టారని రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ జరగలేదనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి సవ్యంగా ఉందనీ, ఎటువంటి గాయాలూ లేవనీ కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమెను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.