జగన్ సర్కార్ అప్పులు.. పురంధేశ్వరి పరువు తీసేసిన బీజేపీ హై కమాండ్!

జగన్ సర్కార్ కు గొడుగుపట్టడమే తన రాజకీయమని కుండ బద్దలు కొట్టేసింది. జగన్ కు మేలు చేయడం కోసం రాష్ట్రంలో పార్టీ పతనం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వైసీపీతో అంటకాగుతున్నారంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరికి ఆ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చింది. పురంధేశ్వరి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పుల గురించి విమర్శలు గుప్పించారు. అధిష్ఠానానికి అందుకు సంబంధించిన నివేదికలు సమర్పించి ఫిర్యాదు సైతం చేశారు. స్వయంగా కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిసి మరీ జగన్ సర్కార్ అడ్డగోలు ఆర్థిక అక్రమాల గురించి కూలంకషంగా వివరించారు. నిర్మలా సీతారామన్ తో భేటీ సంతృప్తి కరంగా సాగిందనీ, జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై చర్యలు తీసుకుంటామని నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చారనీ పురంధేశ్వరి ట్వీట్ కూడా చేశారు.

ఇది జరిగి ఒకటి రెండు రోజులు అయ్యిందో లేదో.. పార్లమెంటు సాక్షిగా విత్తమంత్రి ఏపీలో జగన్ సర్కార్ అప్పులన్నీ నిబంధనలకు లోబడే ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఔను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అడిగిన ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సమాధానం ఏపీలో బీజేపీ పరువు తీసింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసిన విమర్శలు, ఆరోపణలు పూర్తి అవాస్తవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్పినట్లైంది. పార్టీ హై కమాండ్ కు తమ పార్టీ ఏపీ నేతల కన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇమేజ్ ను కాపాడటమే ముఖ్యమన్న విషయాన్ని విత్త మంత్రి సమాధానం తేల్చేసింది.   ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులను పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ప్రజల ముందు ఉంచారు. అవే వివరాలను విత్త మంత్రికీ, పార్టీ పెద్దలకూ అందజేశారు.

తీరా పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం తరువాత పురంధేశ్వరి అవమానంతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పురంధేశ్వరి జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, అరాచకత్వం గురించి చెప్పిన వివరాలన్నీ శుద్ధ అబద్ధాలని విత్త మంత్రి పార్లమెంటు సాక్షిగా  చెప్పేసి సొంత పార్టీ అధ్యక్షురాలి నివేదికలను తప్పుడు నివేదికలేనని తేల్చేశారు.  ఏపీ అప్పుల విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న లెక్కలే కరెక్టని చెప్పారు.  

వాస్తవానికి నిర్మలా సీతారామన్ సొంత పార్టీ పరువును గంగలో కలుపుతూ చెప్పిన వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి.  టీడీపీ దిగిపోయే నాటికి అంటే 2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు ఉంటే..  ఈ ఏడాది నాటికి అవి రూ.4,42,442 కోట్లకు చేరాయని  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. అంటే వైసీపీ హయాంలో   అప్పులు రూ. 1 లక్షా 70వేల కోట్లు మాత్రమే అన్నారు.  అయితే ఈ లెక్క  రాష్ట్ర బడ్జెట్‌లోని గణాంకాల ఆధారంగా  రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక. జగన్ సర్కార్ ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాల గురించి మాత్రమే నిర్మలా సీతారామన్ చెప్పారు.  కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులను దాచేశారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల లెక్కలు జగన్ సర్కార్ చెప్పడం లేదంటూ  కాగ్ గత నాలుగేళ్లుగా మొత్తుకుంటూనే ఉంది.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ సర్కార్  ఆర్థిక అరాచకత్వం, అడ్డగోలు అప్పులపై  తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిగా వైసీపీ నేతలు ఆమెపై విమర్శలతో విరుచుకుపడ్డారు. అలాంటి సమయంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలికి అండగా నిలవాల్సిన బీజేపీ అధిష్ఠానం పురంధేశ్వరి పరువు తీసేసింది. పురంధేశ్వరి తెలుగుదేశం గళం వినిపిస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలే వాస్తవమని తేల్చే సింది. తద్వారా వైసీపీకి  ఎనలేని ప్రయోజనం చేకూర్చింది. రాష్ట్రంలో ఇక బీజేపీ వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా నోరెత్తే అవకాశం లేకుండా చేసింది.  ఇది ఏపీ బీజేపీ నేతలకు తలవంపులే. ముఖ్యంగా పురంధేశ్వరికి తీరని అవమానమే.  గత నాలుగేళ్లుగా రహస్య మైత్రిని కొనసాగించిన బీజేపీ ఇప్పుడు ఆ ముసుగు తీసేశింది.

రాష్ట్రంలో బలోపేతం కావడం తమ లక్ష్యం  కాదనీ, వైసీపీకి అన్ని విధాలుగా అండదండగా నిలవడమే ఏపీలో తన విధానమనీ విస్పష్టంగా చెప్పేసింది. ఇక తేల్చుకోవలసింది ఏపీ బీజేపీ నేతలే. అబద్ధాలకు వత్తాసు పలుకుతున్న అధిష్ఠానానికి అడుగులకు మడుగులొత్తడమా? తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలలా ధిక్కార స్వరం వినిపించడమా అన్నది ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించుకోవాలి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu