చంద్రబాబుతో మనోజ్ ప్యామిలీ భేటీ..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ఆతడి భార్య మంచు మౌనికా సోమవారం సాయంత్రం భేటీ  అయ్యారనీ,   చంద్రబాబు నివాసానికి మంచు మనోజ్ ప్యామిలీ  వచ్చారనీ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. 

మంచు మనోజ్ ఫ్యామిలీ.. సైకిల్ పార్టీలోకి చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నదనీ,  ఆ క్రమంలో వీరు చంద్రబాబుతో భేటీ అయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.  ఇటీవలే మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డిలు వివాహం చేసుకొన్న సంగతి  తెలిసిందే. ఆ క్రమంలో భూమా మౌనికా రెడ్డి రాజకీయ అరంగేట్రం గురించి మంచు మనోజ్ స్పందించారు. మౌనికా ఓకే అంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ  మనోజ్  క్లారిటీ గా చెప్పిన సంగతి తెలిసిందే.  

మరోవైపు భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల కుమార్తెలు అఖిల ప్రియ, మోనికా రెడ్డి. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఆమె మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ గెలుపులోనే కాదు.. నంద్యాల ఉప ఎన్నికల్లో   భూమా బ్రహ్మనందరెడ్డి విజయంలో  సైతం మౌనికా రెడ్డి అన్ని తానై వ్యవహరించిన విషయం తెలిసిందే. 

ఇంకోవైపు.. 2019 ఎన్నికల ముందు మంచు మోహన్ బాబు వైసీపీలో చేరారు.  ఆ ఎన్నికలలో ఎన్నికల్లో  వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే..  మోహన్ బాబుకు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఏమంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వలేదు.  

అలాంటి వేళ.. గతేడాది మంచు మోహన్ బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ  హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  మోహన్ బాబు  తెలుగుదేశం గూటికి చేరనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప మోహన్ బాబు వైసీపీని వీడలేదు. తెలుగుదేశం పంచన చేరలేదు.  
  
అదీకాక మోహన్ బాబు పెద్ద కుమారుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు భార్య విరోనికా రెడ్డి ఏపీ సీఎం  జగన్‌కు అత్యంత సమీప బంధువన్న విషయం అందరికీ తెలిసిందే. అదీకాక మౌనికతో వివాహంతో మంచు మనోజ్, మంచు విష్ణు ఫ్యామిలీల మధ్య విభేదాలు పొడసూపాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. మనోజ్, విష్ణులు ఘర్షణ పడ్డారనీ, ఇరువురి మధ్యా సత్సంబంధాలు లేవనీ కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  మంచు మనోజ్, తన భార్యతో కలిసి చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారు, అదీ కూడా ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా వీరి సమావేశం వెనుక ఉన్న అసలు సిసలు కారణాలు ఏమిటీ? అయినా.. ఇంత అర్జెంట్‌గా చంద్రబాబుతో  మనోజ్ దంపతుల భేటీకి కారణమేమిటన్న  చర్చ  రాజకీయ, సినీవర్గాల్లో జోరందుకుంది.

ఓ వేళ మంచు మనోజ్ ఫ్యామిలీని తెలుగుదేశంలోకి చంద్రబాబు ఆహ్వానిస్తే.. మంచు మౌనిక పోటీ చేస్తారా?  మంచు మనోజ్ ఎన్నికల బరిలోకి దిగుతారా? ఓ వేళ మంచు మనోజ్ పోటీ చేస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి బరిలో దిగే అవకాశం ఉందని, అలాగే ఓ వేళ మౌనికా ఎన్నికల బరిలోకి దిగితే.. నంద్యాల నుంచి పోటీ చేస్తుందనే ఓ ప్రచారం సైతం జోరుగా సాగుతున్నది.  

ఇక చంద్రబాబు నాయుడు రేపటి నుంచి అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఏపీలోని పలు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారు. అలాంటి వేళ.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో మంచు ఫ్యామిలీ భేటీ అనంతరం వీరి భేటీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu