సమయం లేదు మిత్రమా.. అటో ఇటో తేల్చుకో.. పవన్ కు ముంచుకొస్తున్న డెడ్ లైన్
posted on Aug 1, 2023 1:51PM
బీజేపీ హై కమాండ్ కు మిత్ర పక్షాలంటే ఇసుమంతైనా లక్ష్యం లేదని, ఉండదని మరో సారి తేటతెల్లం అయ్యింది. గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనకు అడుగడుగునా ఎదురైనవి అవమానాలే అనడంలో సందేహం లేదు. తనను బీజేపీ రాష్ట్ర శాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనీ, అయినా తాను ఖాతరు చేయననీ, తనకు పార్టీ హై కమాండ్ తో సత్సంబంధాలున్నాయని స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్న కాలంలో పరిస్థితి అలాగే ఉండేది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఏపీ బీజేపీ జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతున్న చందంగా వ్యవహరించింది. ఆ కారణంతోనే సోము వీర్రాజును పదవి నుంచి బీజేపీ అధిష్ఠానం తొలగించిందని.. ఆయనను వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్ర నాయకులు భావించారు. సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టిన పురంధేశ్వరి కూడా సోము వీర్రాజు విధానాలను గట్టిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో అరాచకపాలనపై బీజేపీ కూడా సమరశంఖం పూరించేందుకు సిద్ధమైందని అంతా భావించారు. ఇటీవల హస్తినలో బీజేపీ మిత్రపక్షాలు.. అంటే ఎన్డీయే బాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. ఆయన హాజరయ్యారు కూడా. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి నడ్డాలతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం హస్తినలో విలేకరులతో మాట్లాడిన ఆయన అధికార వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ప్రయాణిస్తానని స్పష్టం చేయడమే కాకుండా.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయననీ, తెలుగుదేశం పార్టీతో కూడా కలుస్తామనీ చెప్పారు. పవన్ కల్యాణ్ తొలి నుంచీ కూడా ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనీయనని చెబుతూనే ఉన్నారు. రాష్ట్రంలో పొత్తు పొడుపుల ఊసు ఎత్తింది కూడా తొలుత పవన్ కల్యాణే. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనీయననీ, అందు కోసం తన వంతు కృషి చేస్తాననీ చెబుతూ వస్తున్నారు. బీజేపీతో జనసేన మైత్రి కొనసాగుతోంది. ఈ రెండు పార్టీలూ కూడా ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయని పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇటీవలి ఆయన హస్తిన పర్యటనలో కూడా బీజేపీ అగ్రనేతలతో భేటీ తరువాత కూడా అదే మాట చెప్పారు. బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు విషయంలో చిన్న గ్యాప్ ఉందనీ, దానిని తాను పూడ్చి కలిసే ఎన్నికల బరిలోకి దిగుతామని సూచన ప్రాయంగానైనా చెప్పారు.
అంతకు ముందు చంద్రబాబు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో హస్తినలో భేటీ అయ్యారు. మధ్యలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి కలిశారు. అప్పుడు కూడా వీరి మధ్య రాష్ట్ర రాజకీయాలపైనే చర్చ జరిగింది. పొత్తుల విషయంగానే ఆ చర్చ జరిగిందని అంతా భావించారు. పరిశీలకుల విశ్లేషణలు కూడా ఆ దిశగానే సాగాయి. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు బీజేపీ తన ముసుగు తీసేసింది. ఏపీలో తన మొగ్గు ఎవరివైపో పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలు కొట్టేసింది. ఏపీతో తన మిత్రపక్షమైన జనసేన ఏపీ సర్కార్ ఆర్థిక అవకతవకలపై, అడ్డగోలు అప్పులపై ఇంత కాలం చేస్తున్న విమర్శలన్నీ అబద్ధాలంటూ పార్లమెంటు సాక్షిగా నిర్మలాసీతారామన్ చెప్పడంతో పవన్ కల్యాణ్ గాలి తీసేసినట్లైంది.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు మేలు చేకూరేలా పార్లమెంటు సాక్షిగా అర్ధ సత్యాలు చెబుతూ మిత్రపక్షాన్నే కాకుండా, సొంత పార్టీ ఏపీ అధ్యక్షురాలిని కూడా తలదించుకునేలా చేయడానికి బీజేపీ హై కమాండ్, కేంద్రంలోని మోడీ సర్కార్ వెనుకాడలేదంటే.. వారి మద్దతు, ప్రోత్సాహం ఎవరికి ఉన్నాయో తేటతెల్లమైపోయింది. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ చెబుతున్నట్లుగా ఏపీలో జగన్ సర్కార్ గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అంటూ బీజేపీ వైపు చూడటంలో అర్ధం లేదన్న సంగతి అవగతమైపోయింది. ఇక ఇప్పుడు బంతి పవన్ కల్యాణ్ కోర్టులో ఉంది. నిర్ణయించుకోవలసినది ఆయనే. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్నమాటకు కట్టుబడి ఉంటారా? కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీతో కలసే ప్రయాణం అంటారా? నిర్ణయించుకోవలసింది ఆయనే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే.. పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు మార్లు చెప్పిన చందంగా జనసేన, తెలుగుదేశం కలిసి పని చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓట్ స్టేక్ ఒక శాతం కంటే తక్కువ. అటువంటి పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుందంటే ఎవరూ విశ్వసించరు. జగన్ సర్కార్ పై తీవ్ర మైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతుందని పవన్ కల్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమంటూ జరిగితే అది ప్రధాన విపక్షం తెలుగుదేశం, జనసేనల మధ్యే చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీవైపు మళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇప్పటికే విభజన హామీలను నెరవేర్చే విషయంలో బీజేపీ ఏపీ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిందనీ, మాట తప్పి మోసం చేసిందనీ జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
అదే సమయంలో రాష్ట్రంలో అన్ని వర్గాలనూ ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండగా నిలుస్తోందన్న ఆగ్రహమూ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీని కలుపుకు పోవడమంటే జనసేన ప్రజలలో ఉన్న పలుకుబడిని పలుచన చేసుకోవడం వినా మరో ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంటే బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలకు వెడితే దాని వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టమే ఎక్కువ అని అంటున్నారు. 2019లో ఒంటరిగా పోటీ చేసిన అందుకు తగ్గ ఫలితం అనుభవించింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ తరువాత జనసేన పార్టీ టికెట్ పై గెలిచిన ఒకే ఒక్కడు కూడా ఫ్యాన్ కిందకు చేరి పోయాడు. ఇప్పుడు కూడా మిత్రపక్షం కనుక అంటూ బీజేపీతో కలిసి నడిస్తే అదే ఫలితం పునరావృతమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాన విపక్షం తెలుగుదేశం ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజలలో ఉంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తున్నది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అలాగే జనసేనాని కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ మాత్రం ఎప్పుడో ఒక సారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం జగన్ సర్కార్ ను అన్ని రకాలుగా అండదండగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో.. అందులోనూ జగన్ సర్కార్ అప్పుల విషయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటు వేదికగా ఇచ్చిన సమాధానం తరువాత ఏపీలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు అన్నది ఔటాఫ్ క్వశ్చన్ అని పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికలకు బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలంటున్న పవన్ కల్యాణ్ కు బీజేపీ తన రూటేమిటో తేల్చేసింది. దీంతో పవన్ కల్యాణ్ ముందు ఇప్పుడు మిగిలినవి మూడే ఆప్షన్లు. వాటిలో ఒకటి.. మిత్ర ధర్మమంటూ బీజేపీతోనే ప్రయాణం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటం. ఎందుకంటే పవన్ బీజేపీతో నే ప్రయాణిస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశం ఖాతాలోనే పడుతుంది. లేదూ జనసేన పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. ఇక చివరి ఆప్షన్ ఏమిటంటే బీజేపీని వదిలేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం దీని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటమే కాకుండా జనసేన కూడా బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. బంతి జనసేనాని కోర్టులోనే ఉంది. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో మరి?