హస్తిన వేదికగా బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ.. ఎందుకుంటే?
posted on Mar 18, 2025 12:35PM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయిన పారిశ్రామిక వేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా బిల్ గేట్స్ తో చంద్రబాబు అనుబంధం కొనసాగుతూనే ఉంది. తొలి సారి బిల్ గేట్స్ తో భేటీకి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినప్పుడు గేట్స్ అయిష్టంగానే అంగీకారం తెలిపారు. అయితే ఆ తొలి భేటీలోనే చంద్రబాబు విజనరీ బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు.
ఇటీవల విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు బిల్ గేట్స్ తో దావోస్ లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ కీలక రంగాలలో సహకారం అందించేందుకు అంగీకారం కుదిరింది. ఆ సందర్భంగా చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్నిబిల్ గేట్స్ ఒక అపురూప బహుమతితో చాటారు. ఔను బిల్ గేట్స్ చంద్రబాబుకు తాను కాలేజీని వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేయడం నుంచి, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఆ ఆపరూప కానుక నవ్యాంధ్ర పురోగతికి తాను చేసే కృషికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. అటువంటి అనుబంధం ఉన్న గేట్స్, చంద్రబాబు మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీకి ఢిల్లీ వేదిక కానుంది.
చంద్రబాబు మంగళవారం (మార్చి 18) సాయంత్రం హస్తిన పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పుర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరౌతారు. ఆ తరువాత కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అదే విధంగా ప్రధాని మోడీని కలిసి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అలాగే బుధవారం (మార్చి 19) మధ్యాహ్నం బిల్ గేట్స్ తో సమావేశమౌతారు.
ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య సహకార ఒప్పందం చేసుకుంటారు. ఈ కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం అందించే విషయంపై దావోస్ లో భేటీలో అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు హస్తిన నుంచి అమరావతికి తిరిగి వస్తారు. ఆ మరునాడు అంటే గురువారం (మార్చి20) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెడతారు. శుక్రవారం (మార్చి 21) తిరుమలేశుని దర్శించుకుంటారు.