తెలంగాణ రాజకీయాలు.. ఈ భేటీల ఆంతర్యమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రతిపక్షం అనేదే లేని సభలో.. ఉన్న ఒకే ఒక్క ప్రత్యర్థి పార్టీ కూడా హాజరు కాకపోవడంతో సభ సాఫీగా సాగుతోంది. బడ్జెట్ ప్రవేశ పెట్టడం, బడ్జెట్ పై చర్చ, వివిధ బిల్లుల ఆమోదం వంటి వన్నీ ఏ ఆటంకాలూ, అవాంతరాలు, అభ్యంతరాలూ లేకుండా జరిగిపోయాయి. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగా వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ వేడెక్కుతోంది. 

అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో కొన్ని భేటీలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వాటిలో ప్రధానంగా కాంగ్రెస్ భహిష్కృత ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్పఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఒకటి. అక్కడ ఆయన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. అలాగే మరో మాజీ మంత్రి హరీష్ రావుతో కూడా ముచ్చటించారు. ఆయన వారితో ఏం మాట్లాడారు. ఏ విషయంపై చర్చించారు అన్నది పక్కన పెడితే తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లి కేటీఆర్, హరీష్ రావులతో చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ భేటీలపై చర్చ కొనసాగుతుండగానే మంగళవారం (మార్చి 18) తెలంగాణ అసెంబ్లీలో మరో సంచలన భేటీ జరిగింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. వీరిరువురూ కలిసి ఫొటోలకు పోజులిచచ్చారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ సమావేశం నుంచి కేటీఆర్ బయటకు వెడుతుండగా.. జానా రెడ్డి ప్రవేశిస్తున్న సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద జానా కారు చూడగానే కేటీఆర్ హాయ్ అంకుల్ అంటూ పలకరించి ఆయన వద్దకు వెళ్లారు. జానా రెడ్డి కూడా కేటీఆర్ ను ఆప్యాయంగా పలకరించారు.

ఈ  సందర్భంగా కేటీఆర్ జానాను హత్తుకుని ఆయన వయస్సుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు వయసెక్కడ అయిపోయింది.. సెంచరీ కొట్టాలి, కొడతారు అని కేటీఆర్ అన్నారు. దీనికి జానా రెడ్డి నవ్వులు చిందించారు.  మొత్తం మీద తీన్మార్, జానాలతో కేటీఆర్ భేటీలు తెలంగాణ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.