కేటీఆర్ రిజైన్ చేయాల్సిందే... హోరెత్తుతున్న సోషల్ మీడియా!
posted on Sep 15, 2021 11:15AM
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తారనే పేరున్న తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలోనే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారు. నెటిజన్లు కేటీఆర్ ను ఆటాడుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి... తప్పుడు ట్వీట్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారిన గిరిజన బాలిక దారుణ హత్యాచారం ఘటనకు సంబంధించిన విషయం కావడంతో విపక్షాలు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
వినాయక చవితి ముందు రోజు సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. ఆరేండ్ల చిన్నారిపై లైగింక దాడికి పాల్పడి దారుణంగా చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. అయితే చిన్నారి హత్యపై స్పందిస్తూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఘటన అత్యంత బాధాకరమంటూ ఈనెల 12న ట్వీట్ చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు రచ్చ రచ్చవుతోంది.
ఆరేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు ఇంకా పోలీసులకు దొరకలేదు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఫలితం దక్కడం లేదు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులే ప్రకటించారు. అంతేకాదు నిందితుడిని పట్టిస్తే 10 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో కేటీఆర్ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘నిందితుడు ఎక్కడ మంత్రిగారూ? అతడిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?’’ అంటూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కేటీఆర్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్ ట్వీట్‌ను తప్పుబట్టారు. నిందితుణ్ని గంటల్లో పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేస్తే.. ఆచూకీ తెలిపినవారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారని.. ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు.
తనపై వస్తున్న విమర్శలపై కేటీఆర్ మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా ట్వీట్ చేశానని విచారం వ్యక్తం చేశారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారని తెలిపారు. నిందితుణ్ని త్వరగా పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు.
మొత్తంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్... నెటిజన్లకు టార్గెట్ కావడం ఆసక్తిగా మారింది. అసలు పోలీసుల నుంచి సమాచారం లేకుండానే నిందితుడిని పట్టుకున్నామని కేటీఆర్ ట్వీట్ చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ అంశంలోనే కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామాలతో కేటీఆర్ అనుచరులతో పాటు టీఆర్ఎస్ కేడర్ లో మాత్రం నిస్తేజం అలుముకుంది.