హైకోర్టులో ర‌ఘురామ‌కి ఎదురుదెబ్బ‌.. సీబీఐ కోర్టు తీర్పుపై ఉత్కంఠ‌..

ర‌ఘురామ ఆశించిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. అయినా, సీఎం జ‌గ‌న్‌కు బెయిల్ ర‌ద్దు ముప్పు వీడ‌లేదు. జ‌గ‌న్ కేసును సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాలంటూ ఎంపీ ర‌ఘురామ వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో.. సీబీఐ కోర్టు తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. 

సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై వాదనలను విన్న హైకోర్టు.. బుధ‌వారం ర‌ఘురామ పిటిష‌న్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక‌, సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి పెరిగిపోయింది.

జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌లపై సీబీఐ కోర్టులో జులై 30న వాదనలు ముగిశాయి. గత నెల 24నే తీర్పు వెల్లడించాల్సి ఉండ‌గా.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి. గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ తీర్పును సెప్టెంబ‌ర్ 15కి వాయిదా వేసింది. దీంతో.. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దుపై సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే టెన్ష‌న్ నెల‌కొంది. 

మరోవైపు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేశారంటూ ట్వీట్ చేసిన సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న రఘురామ పిటిషన్‌పైనా సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.