సారీ.. మీరిచ్చే పద్మశ్రీ నాకొద్దు!!!

 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోదరి, ప్రముఖ రచయిత్రి అయిన గీతా మెహతా కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గీతా మెహతా ఈ అవార్డును తిరస్కరించారు. ఈ సమయంలో తాను అవార్డు తీసుకోవడం సముచితం కాదని, అందుకే తిరస్కరిస్తున్నానని తెలిపారు.

నవీన్‌ పట్నాయక్‌ సోదరి గీతా మెహతా ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్నారు. ‘భారత ప్రభుత్వం తనను పద్మశ్రీ అవార్డుకు తగిన వ్యక్తిగా భావించి పురస్కారం ఇచ్చినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. కానీ త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తాను ఈ అవార్డును తిరస్కరించాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను. ఈ సమయంలో నేను అవార్డు తీసుకుంటే అది ప్రభుత్వానికి, నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అది నన్ను ఇంకా బాధిస్తుంది’ అని గీతా మెహతా ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అయితే పద్మశ్రీ అవార్డు ప్రకటించడానికి కొద్ది నెలల క్రితం గీతా మెహతా, ఆమె భర్త సోనీ మెహతా ప్రధాని మోదీని కలుసుకుని 90 నిమిషాలు మాట్లాడారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని ఎంపీ సీట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో ఇటు బీజేపీ, బీజేడీకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇటీవల మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాయక్‌‌పై విరుచుకుపడటం, ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉండటం తెలిసిందే. బీజేపీతో కానీ, కాంగ్రెస్‌తో కానీ బీజేడీ పొత్తు ఉండదని పట్నాయక్ చెబుతున్నప్పటికీ, బీజేపీకి 'బి టీమ్' బీజేడీ అంటూ కాంగ్రెస్ తరచు విమర్శలు చేస్తోంది.