ఈవీఎంల హ్యాకింగ్‌కు వంద శాతం అవకాశముంది!!
posted on Jan 26, 2019 3:22PM
ఉండవల్లిలోని ప్రజావేదికలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈవీఎంలలో వంద శాతం హ్యాకింగ్‌కు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని ఎంపీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రానికి ఈ నాలుగున్నరేళ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారని, నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఈవీఎంలపై అనేక పార్టీల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ ఒక రిఫరీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. వీవీప్యాట్ రశీదులు వంద శాతం లెక్కించేలా ఒత్తిడి చేయాలని లేదా బ్యాలెట్ విధానానికి వెళ్లాలి అని అన్నారు. ఈవీఎంలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలను నష్టాల్లోకి నెడుతున్నారని, బ్యాంకులను దివాలా తీయిస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో అభివృద్ధి చెందాలన్నా వీల్లేని దుస్థితి తెస్తున్నారని, దేశంలో భయోత్పాతం సృష్టిస్తున్నారంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
వెనుకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాలని కోరామని, నాలుగున్నరేళ్లలో రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారని కేంద్రంపై చంద్రబాబు మండిపడ్డారు. రూ.350 కోట్లు వెనక్కి తీసుకుని ఏడాది అవుతున్నా నేటికీ తిరిగి ఇవ్వలేదన్నారు. దానికి స్పష్టమైన కారణం లేదని చెప్పారు. 7 జిల్లాలకు రెండేళ్లలో రూ.700 కోట్లు నిలిపివేశారని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వట్లేదన్నారు. అదే తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో 9 జిల్లాలకు రూ.450 కోట్లు ఇచ్చారని చెప్పారు.
ఈ నాలుగున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌పై రూ.10,449 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఇంకా రూ.3,722 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని చెప్పారు. నాలుగు నెలలుగా పోలవరానికి బిల్లులు చెల్లించడంలేదని, రూ.57940 కోట్లకు డీపీఆర్-2 పంపితే కేంద్రంలో స్పందన లేదని విమర్శించారు. విజయవాడ, గుంటూరు డ్రెయినేజీకి ఇస్తామన్న నిధులు, రాజధానికి ఇస్తామన్న మరో రూ.1000 కోట్ల నిధులకు అతీగతీ లేదని విమర్శించారు.