గణితంతో ప్రపంచాన్ని విస్మయపరిచిన శీనివాస రామానుజన్..!

మనిషి జీవితం మొత్తం గణితం పై ఆధారపడింది. ఉదయం లేచింది మొదలు సమయం చూడటం నుండి ప్రతి పనిలోనూ గణితాన్ని ఉపయోగిస్తాము. ఈ గణిత శాస్త్రానికి సంబంధించి భారతీయులు గర్వంగా చెప్పుకోదగినవారు శ్రీనివాస రామానుజన్.  భారతదేశంలో గణిత దినోత్సవాన్ని శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్బంగా జరుపుకుంటారు. శ్రీనివాస రామానుజన్   రచనలు దేశవ్యాప్తంగా,  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేశాయి. శ్రీనివాస రామానుజన్  1887, డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మదినం అయిన డిసెంబర్ 22వ తేదీను గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకుంటే..

1887, డిసెంబర్ 22వ తేదీన తమిళనాడులోని ఈరోడ్ లో అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీనివాస రామానుడన్ తన 12 సంవత్సరాల వయస్సులో అధికారిక విద్య లేకపోయినా త్రికోణమితిలో రాణించాడు. ఆయనే సొంతంగా   అనేక సిద్ధాంతాలను అభివృద్ధి చేశాడు.

1904లో మాధ్యమిక పాఠశాలను పూర్తి చేసిన తర్వాత, రామానుజన్ కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదవడానికి స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించాడు.  కాని అతను ఇతర సబ్జెక్టులలో రాణించలేకపోవడం వల్ల స్కాలర్షిప్ కోల్పోయాడు.  14 సంవత్సరాల వయస్సులో రామానుజన్ ఇంటి నుండి పారిపోయాడు. ఆయన  మద్రాసుకు చేరుకుని, మద్రాసులోని  పచ్చయ్యప్ప కాలేజీలో చేరాడు.  అక్కడ  కూడా ఇతర సబ్జెక్టులలో కాకుండా  గణితంలో మాత్రమే రాణించాడు. తన చదువును  ఫెలో ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పూర్తి చేయలేకపోయాడు. దీంతో ఆయన అధికారిక చదువు ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికే  భయంకరమైన పేదరికంలో ఉన్న శ్రీనివాస  రామానుజన్  గణితంలో తనకున్న అభిరుచి కారణంగా  స్వతంత్ర పరిశోధనను కొనసాగించారు.

తన పరిశోధనల ఫలితంగా తొందరలోనే  వర్ధమాన గణిత శాస్త్రజ్ఞుడిగా  చెన్నైలోని గణిత శాస్త్ర వర్గాల్లో ఒకరిగా  గుర్తించబడ్డాడు. 1912లో  ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడు  అయిన రామస్వామి అయ్యర్  శ్రీనివాస రామానుజన్ కు  మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్ ఉద్యోగం రావడంలో   సహాయం చేశాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొకవైపు గణిత శాస్త్రానికి చెందిన తన పరిశోధన ఫలితాలను   బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞులకు పంపేవాడు.  1913లో కేంబ్రిడ్జ్‌కు చెందిన GH హార్డీ రామానుజన్ సిద్ధాంతాలకు ముగ్ధుడై అతనిని లండన్‌కు పిలిపించాడు. అప్పుడే శ్రీనివాస రామానుజన్ జీవితంలోనూ,  శాస్త్రవేత్తగానూ  పురోగతిని అందుకున్నాడు.

రామానుజన్ 1914లో బ్రిటన్‌కు వెళ్లాడు. అక్కడ హార్డీ అతన్ని కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కాలేజీలో చేర్చాడు. 1917లో రామానుజన్ లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి సభ్యునిగా ఎన్నికైన తర్వాత విజయపథంలో దూసుకెళ్లాడు.   1918లో రాయల్ సొసైటీకి ఫెలో అయ్యాడు. ఇలా  రాయల్ సొసైటీలో గౌరవనీయమైన స్థానాన్ని సాధించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా నిలిచారు.

తన పరిశోధనలు, తన జీవితం అభివృద్ది చెందుతున్న సమయంలోనే  రామానుజన్ 1919లో బ్రిటన్‌లో ఆహారాన్ని అలవాటు చేసుకోలేక భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.  1920లో 32 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అయినప్పటికీ, గణిత శాస్త్ర రంగంలో ఆయన విజయాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడుతున్నాయి.  1729 సంఖ్య ప్రత్యేకత కావచ్చు, మ్యాక్స్- తీటా ఫంక్షన్స్ పై చేసిన పరిశోధనలు కావచ్చు, నంబర్ థియరీ పరిశోధనలు కావచ్చు.. ప్రతి ఒక్కటీ ప్రపంచానికి విస్మయాన్ని కలిగించాయి. ఎంతో టెక్నాలజీ అభివృద్ది చెందినా ఇప్పటికీ రామానుజన్ సూత్రాలు, ఫలితాలను చూసి విస్మయం చెందాల్సిందే.  రామానుజన్ ప్రచురించని ఫలితాలను కలిగి ఉన్న  మూడు నోట్‌బుక్‌లను విడిచిపెట్టాడు.  గణిత శాస్త్రజ్ఞులు వీటికోసం పని చేస్తూనే ఉన్నారు. రామానుజన్ గొప్పదనాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో, అప్పటి  ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 22ని - రామానుజన్ పుట్టిన రోజును  దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు.

                                               *నిశ్శబ్ద.