మూడో ప్రపంచయుద్ధం.. వినాశనం తప్పదా?
posted on Nov 20, 2024 3:39PM
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని బైడెన్.. ప్రపంచ యుద్ధానికి తెరలేపే నిర్ణయం తీసుకున్నారా? అంటే ప్రపంచ దేశాల మేధావులు అవుననే అంటున్నారు. బైడెన్ ఓటమి ఉక్రోషంతో తీసుకున్నా, వయస్సు రిత్యా వివేకం, వివేచనా కోల్పోయి తీసుకున్నా.. ఆయన నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపింది. ఇంతకీ బైడెన్ ఏం చేశారంటే.. అమెరికా ఇచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుతిన్... అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు ఇచ్చేశారు. దీంతో ప్రపంచం అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశంపైనైనా దాడులు చేస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిదే. ఆ సమయంలోనే ఆయన అణు దాడికి కూడా వెనుకాడబోమని విస్ఫష్టంగా చెప్పారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారం నుంచి దిగిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు తమ దేశం సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో మండిపడిన పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన కారణం తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇచ్చిన హామీయే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పుతిన్, ట్రంప్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అమెరికన్లు ఆయన అధికార పగ్గాలు చేపడితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని నమ్మారు. అదే సమయంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా అమెరికా ఎన్నికలలో పోటీ చేసిన బైడెన్ విధానాల కారణంగానే ఓటమి పాలయ్యారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా ఉక్రెయిన్ కు తన క్షిపణుల వినియోగానికి అనుమతించడం ద్వారా రష్యాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు పెచ్చరిల్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.