తల్లిదండ్రులే చేతులారా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు.. కారణాలు ఇవే!

పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడాలి. ఒక్కోసారి పిల్లలు చేసే అల్లరిని, వారు చెప్పే కట్టు కథలను తెలివిగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరికొన్నిసార్లు పిల్లలు చేసే తప్పులను, మోసాన్ని తట్టుకోవలసి వస్తుంది,  కొన్నిసార్లు  పిల్లల డిమాండ్లను నెరవేర్చవలసి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న ప్రతిదీ వారి మంచికోసమేనని, అది మంచి పనేనని భావిస్తుంటారు. దానికి అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలియకుండానే మంచి అనే భ్రమలో పిల్లల జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. దీనికి సంబంధించి విషయాలను పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు కూడా వెల్లడిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చేస్తున్న తప్పులేంటో తెలుసుకుంటే..

నిర్ణయాలు..

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది కావాలంటే అది చేయనివ్వమని నిర్ణయాలు పూర్తీగా పిల్లల చేతుల్లో పెట్టడం  తరచుగా కనిపిస్తుంది. పిల్లలు  తమ కెరీర్‌లో ఏమి కోరుకుంటున్నారు, వారికి ఏమి కావాలి, పిల్లలు కోరుకుంటున్నది ఏంటి?  ఈ విషయాలన్నింటికి సంబంధించి  తల్లిదండ్రులు చాలావరకు పిల్లల ఇష్టానికి వదిలేశాం అని చెబుతూ ఉంటారు.  పిల్లల ఇష్టమే మా ఇష్టం, మేము మా అభిప్రాయాలు పిల్లల మీద రుద్దడం లేదు. అని చెప్పుకుంటూంటారు కూడా.   ఈ కారణంగానే పిల్లల కెరీర్, వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు వారి చేతుల్లోనే పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదని పేరెంటింగ్ నిపుణులు, కౌన్సిలర్లు అంటున్నారు.

తల్లిదండ్రుల తప్పేంటి?

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా దానికి నో చెప్పరు. దీనికి కారణం పిల్లలు ఇష్టమైన రంగంలో చాలా ఆసక్తి చూపిస్తారని దీని వల్ల వారు సులువుగా కెరీర్ లో విజయం సాధించి సెటిల్ అవుతారని నమ్మడం. కొందరు తల్లిదండ్రలు అయితే తమ పిల్లలు ఆసక్తి చూపించిన రంగంలో వారిని చేర్చి ప్రోత్సహించడానికి లక్షలాది రూపాయలు పోయడానికి అయినా సిద్దంగా ఉంటారు. కానీ పిల్లలు కెరీర్ లో విజయం సాదించలేకపోతారు. దీనికి కారణాన్ని పేరెంటింగ్ నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు.

ఇప్పటికాలం తల్లిదండ్రులు  చాలా బిజీ జీవితాలు గడుపుతున్నారు. పిల్లలకు ఏ లోటూ రాకూడదని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి అయినా సిద్దమవుతారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదు. ఆ లోటు భర్తీ చేయడానికి, అది బయటకు కనిపించకుండా ఉండటానికి వారు డబ్బును అడ్డు పెట్టుకుంటున్నారు. డబ్బుతో పిల్లలు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్జ తప్పు. చిన్న తనం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మార్గనిర్దేశకత్వం చేస్తూంటే అది వారి జీవితాన్నిసరైన దిశలో తీసుకెళ్తుంది.

కేవలం డబ్బు వెచ్చింది పిల్లల బాగోగులను చూడటం అంటే అది కృత్రిమంగా పిల్లలను పెంచడం లాంటిది. అదే పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని  తోడ్పాటు ఇస్తూ వారి ఆలోచనలు సరైనవా కాదా అని వారితోనే చర్చింది ఆ తరువాత నిర్ణయం తీసుకునే అదికారం పిల్లలకు ఇస్తే అప్పుడు పిల్లలకు తమ జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే విషయం మీద స్పష్టత వస్తుంది. అలా కాకుండా పిల్లల జీవితం ఎదగడానికి కేవలం డబ్బు సరిపోతుందని తల్లిదండ్రులు బావిస్తే అది చాలా పొరపాటు అవుతుంది.

                                             *నిశ్శబ్ద.