వాలంటీర్లా.. బానిసలా? జగనన్న గొప్పలు చెప్పుకునేది ఇందుకేనా?
posted on Aug 28, 2021 3:54PM
ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాలంటరీ వ్యవస్థతో బాపూజీ కలలను సాకారం చేశామంటూ కోట్లాది రూపాయలు కుమ్మరించి దేశమంతా ప్రచారం చేసుకున్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధి.. సమాజ సేవకులుగా పనిచేయాలన్న మహోన్నత లక్ష్యంతో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు తమ వేతనాలను పెంచాలన్న వాలంటీర్ల డిమాండ్ తో వారందరికీ లేఖలు రాసిన జగన్.. వారి సేవలను ఆకాశానికెత్తారు. వారిది కేవలం సేవేనని, వారికి ఇచ్చేది గౌరవ వేతనమేనని ప్రకటించి వలంటీర్ల వ్యవస్థ ఉన్నతిని మరింతగా పెంచారు.
సీఎం జగన్ తీరు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో అసలు సంగతి మరోలా ఉంది. ఏపీలో వాలంటీర్లపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. తమకు సెల్యూట్ కొట్టలేదని కొందరు, తాము చెప్పినట్లు చేయడం లేదని మరికొందరు వాలంటీర్లపై ప్రతాపం చూపిస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊస్టింగ్ అంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలకు వేగలేక చాలా మంది వాలంటీర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇది భరించలేక కొందరు ఉద్యోగం మానేశారు కూడా. కర్నూల్ జిల్లాలో ఓ వాలంటీర్ లేఖ రాసి మరీ సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ప్రజా ప్రతినిధులను చూస్తూ తాము ఏం తక్కువ అనుకున్నారో ఏమో ఉన్నతాధికారులు కూడా వాలంటీర్లపై ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు.
ఇటీవలే అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే వాలంటీర్ల అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేస్తే.. తాజాగా గుంటూరు జిల్లాలో మునిసిపల్ కమిషనర్ లేడీ వాలంటీర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపాలిటీలో వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ మహిళపై అక్కడి మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి చిందులు తొక్కిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా మహిళ అని కూడా చూడకుండా ఐదు నిమిషాలు లోపలేసి ఉతికిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
నరసరావుపేటలోని నిమ్మతోట ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మహిళ వాలంటీర్ గా పనిచేస్తోంది. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరుస్తున్న తొలి నలుగురు వలంటీర్లలోనూ ఆమె స్థానం సంపాదించింది. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కారణంగా ఆమె ఇటీవల కొన్ని రోజుల పాటు సెలవు పెట్టిందట. ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. వార్డు సచివాలయంలోని అడ్మిన్ ఆమెపై పగబట్టేశారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదని నిత్యం నిందిస్తూనే ఉన్నాడు. అయినా ఆ వేధింపులను భరిస్తూనే పనిచేస్తున్న ఆమెకు.. ఓ మధ్యాహ్నం కమిషనర్ రామచంద్రారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే కమిషనర్ ఆమెను బెదిరింపులపై బెదిరింపులకు దిగుతూ ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? పనిచేస్తున్నావా?.. ప్రశ్నల వర్షం కురిపించారు. మధ్యాహ్నం సమయం కదా.. ఇంటిలో ఉన్న తన పిల్లలకు భోజనం పెడదామని ఇంటికొచ్చాను సార్ అంటూ ఆమె సమాధానం చెప్పినా.. ఆయనగారు శాంతించలేదు.
ఉన్నపళంగా వార్డులోకి రావాలంటూ హుకుం జారీ చేశారు. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే వార్డులోకి వెళ్లిన ఆమెకు కమిషనర్ కనిపించలేదు. సార్ వార్డులోకి వచ్చాను అంటూ ఆమె కాల్ చేస్తే.. కమిషనర్ కార్యాలయానికి రావాలంటూ చెప్పారు. ఆమె పరుగు పరుగున కార్యాలయానికి వెళ్లగా.. అక్కడా కమిషనర్ లేరట. ఆమె అక్కడికి చేరుకున్న అరగంటకు అక్కడికి వచ్చిన కమిషనకర్.. ఆమెపై తనదైన దురహంకారంతో విరుచుకుపడ్డారు. ఎక్కడున్నావ్? ఇలా చేస్తే 5 నిమిషాల్లో లోపలేయించి ఉతికిస్తా.. అంటూ చిందులు తొక్కారు. తానేం చేశానంటూ ఆ లేడీ వలంటీర్ వివరణ ఇచ్చే యత్నం చేయగా.. ముఖానికి ఉన్న మాస్కును విసురుగా తీస్తూ ఆమెపైకి దాడికి వచ్చేలా ఉరుమిఉరిమి చూసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ.. ఇక్కడ అవసరం లేదు అంటూ వెళ్లిపోయారు. ఈ మొత్తం దృశ్యాలను ఆమె పక్కనే ఉన్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. బాధితురాలు కూడా తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెడుతూ మరో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
వాలంటీర్లపై అటు ప్రజా ప్రతినిధులు, ఇటు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటున్నది ఇందుకేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వాలంటీర్లను బానిసలుగా చూడటమే గొప్పతనమా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. వారిది కేవలం సేవేనని, వారికి ఇచ్చేది గౌరవ వేతనమేనని ప్రకటించిన ముఖ్యమంత్రి.. వాళ్లను వేధిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఎంందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు.