సురేఖ సై అంటే రేవంత్ స్కెచ్ పారినట్టే.. గులాబీ బాస్ కు గుబులే? 

పీసీసీ చీఫ్ గా ఎన్నికైనప్పటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ రెడ్డి... హుజూరాబాద్ లో సైతం దిమ్మతిరిగిపోయే భారీ స్కెచ్ కు రూపకల్పన చేశారు. కులాల ఈక్వేషన్లతో గెలుపును ఖాయం చేసుకునే సులభమైన మార్గంలో పయనిస్తున్న కేసీఆర్ కు.. రేవంత్ కూడా అదే దారిలో పయనించి బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. ఫలితంగా... ఇప్పటివరకూ ఈటల గెలుపు ఖాయం అన్న అభిప్రాయాలు స్థానికంగా చెలామణిలో ఉండగా... కొండా సురేఖ రూపంలో రేవంత్ వేసే ఎత్తుతో టీఆర్ఎస్ కు మరింత భారీ గండి పడటం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఒప్పిస్తే రెండు బలమైన బీసీ సామాజికవర్గాల ఓట్లు కచ్చితంగా వన్ సైడ్ అవుతాయన్న అంచనాలున్నాయి. కొండా సురేఖ ప‌ద్మ‌శాలి సామాజికవర్గం కాగా... ఆమె భ‌ర్త కొండా మురళి మున్నూరు కాపు సామాజికర్గానికి చెందిన నాయకుడు. ఇవి రెండూ కూడా బీసీల్లో బలమైనవే కావడం గమనించాల్సిన అంశం. ఈ రెండు సామాజికవ‌ర్గాలకు కలిపి హుజూరాబాద్ లో యాబై వేల‌ పైచిలుకు ఓట‌ర్లు ఉండ‌టంతో ఆ రెండు వర్గాల ప్రజలనూ ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని రేవంత్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. స‌హ‌జంగా కాంగ్రెస్ పార్టీకి ఉండే దూకుడు, కొండా దంపతుల‌కు ఉండే ఆర్ధిక వ‌నరులు, టీఆర్ఎస్ నుంచి కొండా దంప‌తులు అవ‌మాన భారంతో బ‌య‌టికి వ‌చ్చారనే సెంటిమెంట్... ఇలా అనేకమైన కీలకాంశాలు కాంగ్రెస్ గెలుపుకు తప్పకుండా దోహదడతాయని రేవంత్ భావిస్తున్నారు. 

అటు కేసీఆర్... దాదాపు 45 వేల ఎస్సీ ఓట్లను టార్గెట్ చేసి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు కలిపి మొత్తం 1500 కోట్లు విడుదల కూడా చేశారు. పలువురు లబ్ధిదారులను గుర్తించి వారికి చెక్కులు పంపిణీ చేశారు. దీంతో ఎస్సీల ఓట్లు కచ్చితంగా పడతాయని, గెలుపుకు మినిమమ్ గ్యారెంటీ ఎస్సీల ఓట్లేనని కేసీఆర్ అండ్ కో ధీమాగా ఉంది. అయితే రేవంత్ వేసే స్కెచ్ కు కొండా ఒప్పుకుంటే పద్మశాలి, మున్నూరుకాపు ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశాలుంటాయని ఆశిస్తున్నారు. దళితబంధుకు సమాంతరంగా బీసీ బంధు, ప్రజాబంధు, వివిధ కులాలవారీగా బంధు పథకాలకోసం డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో రేవంత్ వ్యూహం కచ్చితంగా ఎంతోకొంత వర్కవుట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  

కౌశిక్ రెడ్డి నమ్మించి కాంగ్రెస్ ను నట్టేట ముంచే ప్రయత్నం చేశాడు కాబట్టి... ఆయన్ని జాయిన్ చేసుకున్న కేసీఆర్ కు అంతకుమించిన నష్టం చేసి చూపించాలని రేవంత్ కసిగా ఉన్నారు. అందుకే ఫైర్ బ్రాండ్ గా పేరున్న సురేఖతో పోటీ కోసం మంతనాలు సాగిస్తున్నారని, ఆమె కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నా కూడా... కేసీఆర్ కు తగిన గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో పోటీకి మొగ్గు చూపే అవకాశం ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొండా మురళి దంపతులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే రాజకీయంగా ఎంతో బలంగా ఎదిగారు. సురేఖ గతంలో శాయంపేట, ప‌ర‌కాల నియోజకవర్గం నుంచి, వ‌రంగ‌ల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా హుజూరాబాద్ తో క‌లిసే ఉండడం విశేషం. 2008లో హ‌న్మ‌కొండ పార్ల‌మెంట్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన అనుభ‌వం కొండా సురేఖ‌కు ఉంది. అప్పుడు క‌మ‌లాపూర్ అసెంబ్లీ హ‌న్మ‌కొండ పార్లమెంట్ ప‌రిధిలోనే ఉండేది. ఇక పాత వ‌రంగ‌ల్ లోనూ చుట్టు ప‌క్క‌ల కూడా కొండా దంప‌తుల‌కు సొంతంగా అభిమానులు, బలమైన క్యాడ‌ర్ కూడా ఉంది. 

అయితే ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయ‌డం ద్వారా ఇటు ప‌ర‌కాల‌, అటు వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముంద‌ని కొండా దంప‌తులు ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. 2014లో వ‌రంగ‌ల్ లో పోటీ చేసి గెలిచినా కూడా సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల క్యాడ‌ర్ పూర్తిగా చెల్లాచెదుర‌ై మ‌ళ్లీ కొండా ప‌ర‌కాల రాదనే ప్ర‌చారం వ‌ల్ల ప‌ట్టు కోల్పాయ‌మని కొండా దంపతులు భావిస్తున్నారు. ఇప్పుడు పార్టీ కోసం హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ నియోజ‌వ‌ర్గాల్లో కూడా త‌మ క్యాడ‌ర్ ను కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఆలోచ‌న‌ కూడా చేస్తున్నట్టు సమాచారం. కానీ హుజూరాబాద్ లో పోటీ చేస్తే ప‌ర‌కాల‌, వ‌రంగ‌ల్ తూర్పు, హుజూరాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ల‌తో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌డానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్న‌ట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇంత‌క‌న్నా బంప‌ర్ ఆఫ‌ర్ కాంగ్రెస్ నుంచి ఇంకేముంటుంద‌ని రేవంత్ చెప్ప‌డంతో హుజూరాబాద్ లో పోటీ చేసే విష‌యంపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారు పోటీ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. రెడ్ సిగ్నల్ వేస్తారా అన్నది తేలాలంటే ఇంకాస్త టైమ్ పడుతుందంటున్నారు. 

ఇప్ప‌టికే బీజేపీ అభ్య‌ర్ధి ఈటెల రాజేంద‌ర్ పాద‌యాత్ర‌లు, స‌భ‌ల ద్వారా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతుండటం, అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ను అభ్య‌ర్ధిగా నిర్ణ‌యించి ప్ర‌చారం చేస్తుండంతో వెంట‌నే కాంగ్రెస్ కూడా అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించాల్సిన అవసరం ఏర్ప‌డింది. మ‌రి రేవంత్ కొండా దంపతుల్ని ఒప్పిస్తారా... సురేఖ ధైర్యం చేస్తారా అనేది చూడాలి.