విచారణకు మాజీ మంత్రి కాకాణి మళ్లీ డుమ్మా.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు.  మైనింగ్ కేసులో ఆయన మంగళవారం (ఏప్రిల్ 1) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన డుమ్మా కొట్టారు. వాస్తవానికి పోలీసులు ఆయనకు సోమవారం (మార్చి 31) విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఆ తరువాత తాను ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో ఉన్నానంటూ మాజీ మంత్రి కాకాణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సారి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మంగళవారం (ఏప్రిల్ 1) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే ఆయన హైదరాబాద్ లోని నివాసంలో కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కాకాణి సమీప బంధువుకు నోటీసులు అందజేశారు. మంగళవారం విచారణకు గైర్హాజరైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఇటు నెల్లూరులో కానీ, అటు హైదరాబాద్ లో కానీ ఆయన అందుబాటులో లేకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారని అంతా భావిస్తున్నారు. ఇలా ఉండగా అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాకాణి బెయిలు పిటిషన్ నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం ఉంది.  ఇలా ఉండగా మాజీ మంత్రి కాకాణి తాను గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను బుధవారం (ఏప్రిల్ 2) సాయంత్రం తరువాత నెల్లూరు చేరుకుంటాననీ, గురువారం నుంచీ అందుబాటులో ఉంటాననీ, విచారణకు సహకరిస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. మరో సారి నోటీసులు ఇస్తారా? లేక రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టినందున పరారీలో ఉన్నట్లు పరిగణించి గాలింపు చర్యలు చేపడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు కాకాణి గిరిజనులను బెదిరించారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.