అధ్యక్ష పదవి నుంచి అన్నామలై ఔట్?
posted on Apr 1, 2025 2:12PM
.webp)
తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే చేరుతుంది.
అయితే బీజేపే పెద్దలు దక్షిణాది రాష్ట్రాలలో పొత్తులు లేకుండా పప్పులు ఉండకవనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఎఐఎడిఎంకె తో పొత్తు కోసం, అన్నమలై ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అవును బీజేపీ నాయకులు కథలు చాలానే చెప్పా వచ్చును కానీ ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి అభీష్టం మేరకే బీజేపీ పెద్దలు అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలానే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తును తెంచుకుని వెళ్ళిన ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి తిరిగి ఎన్డీఎ గూటికి చేరేందుకు గత కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ అవసరాలతో పాటుగా ఆయనకు ఇంకేమి రక్షణలు అవసరం ఉన్నాయో ఏమో కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన ఎన్డీఎ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనేపధ్యంలో బీజేపీ అధిష్టానం పాళని స్వామి కోసం అన్నామలైపై వేటు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే బీజేపీ పెద్దల నిర్ణయం అనూహ్యం అయితే కాదని అంటున్నారు.
నిజానికి గతంలో ఎఐఎడిఎంకె, బీజేపీతో పొత్తును తెంచుకోవడానికి,పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానూ అన్నామలై’ కారణం. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రధాన ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె, రెండూ అవినీతి విషయంలో ఒకే తాను ముక్కలని అన్నామలై అనేక సందర్భాలలో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పళని స్వామి సహా ఇతర నాయకుల అవినీతి ఫైల్స్ బయట పెట్టారు. అయితే అవసరార్ధం కుదిరే పోత్తులకు అంటూ, సొంటూ ఉండదని మహరాష్త్రలో అజిత్ పవార్ తో పొత్తు పెట్టుకున్నసందర్భంలోనే స్పష్టం చేసిన బీజేపీ పెద్దలు తమిళ నాడులో అన్నా డిఎంకె తో మళ్ళీ పొత్తుకు పచ్చజెండా ఊపారు.
కొత్త పొత్తు చర్చల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలోనే పళని స్వామి పొత్తుకు అన్నామలై అడ్డవుతారని అనుమానం వ్యక్త పరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉభయ పార్టీల మధ్య పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు తదితర ఉమ్మడి వ్యవహారాలను చర్చించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పళనిస్వామి అమిత్ షాను కోరినట్లు వార్త లొచ్చాయి.
ఈ నేపద్యంలో అధ్యక్ష పదవి నుంచి అన్నామలై’ తప్పుకోవడం అనూహ్యం కాదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే అన్నా డిఎంకె తో పొత్తు కారణంగా కుల సమీకరణలో వచ్చిన మార్పు(పళని స్వామి,అన్నామలై ఇద్దరిది ఒకే కులం) కారణంగా అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం శిక్షగా భావించరాదని అంటున్నారు. మరో వంక అన్నామలై పొత్తు తనకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్పకుండా పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనందంగా స్వీకరిస్తానన్నారు. అంతే కాదు సాధారణ కార్యకర్తగా పనిచేయడానికి అయినా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అయితే గత అనుభవాల దృష్ట్యా, ఎఐఎడిఎంకెతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయంలో మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు తేడాతో ఓడించడం మొదలు 2023లో పళని స్వామి పొత్తును ఏక పక్షంగా తెంచుకోవడం వరకు ఎఐఎడిఎంకె’తో బీజేపీకి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అయినా పునరపి జననం పునరపి మరణం అన్నట్లు రెండు పార్టీల ఎత్తు పొత్తులు చస్తూ బతుకుతూ వస్తున్నాయి.ఇప్పడు ఉభయ పార్టీలు మరో మారు మరో మూడు ముళ్ళకు సిద్దమయ్యాయి. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో.. ఎప్పుడు పుటుక్కు మంటుండో ఏమో కానీ, ఒక మంచి నాయకుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.