రోడ్డుపై బైఠాయించిన వైసీపీ ప్రజాప్రతినిధి.. జగనన్న పాలనలో అధికారులదే రాజ్యం!
posted on Aug 28, 2021 5:09PM
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. వచ్చాక ఇక అరచకమంటే ఏంటో చూపిస్తున్నారు. ప్రజలకు పప్పుబెల్లాలు పంచుతూ.. తన మనుషులకు మైన్లు, ఇసుకరీచులు దోచిపెడుతున్నారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డికి రాసిచ్చేశారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. కేసులు, అరెస్టులతో నిర్బంధిస్తున్నారు. గుప్పెడు మనుషులను సెలెక్ట్ చేసుకొని.. సర్వం వారికే కట్టబెడుతున్నారు. అందుకే, అధికారులు సైతం ఎవరినీ లెక్క చేయకుండా ఆ కొందరు చెప్పినట్టే నడుచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర రీజియన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదట. విజయసాయి చెబితేనే ఏ పనైనా చేస్తున్నారట. ఇక సీమలో మంత్రి పెద్దారెడ్డిదే రాజ్యం. అందుకే దిగువ స్థాయి వైసీపీ నాయకులూ జగనన్న పాలనకు బలిపశువులు అవుతున్నారు. అధికార పార్టీ అనే పేరే కానీ.. అధికారులు సైతం తమ మాట వినకపోయేసరికి పరువు పోయి అన్నీమూసుకొని పడుంటున్నారని అంటున్నారు.
తాజాగా, గుంటూరు కార్పొరేషన్ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆక్రమణల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరినే టార్గెట్ చేస్తూ పని చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుతో పలువురు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రత్యర్థులే టార్గెట్‌గా కూల్చివేతల హంగామా ఇన్నాళ్లూ విశాఖలోనే చూశాం. ఎంపీ విజయసాయి డైరెక్షన్‌లో జీవీఎమ్‌సీ అధికారులు టీడీపీ నేతల ఆస్తులను అర్థరాత్రి కూల్చేసిన ఘటనలు కలకలం రేపాయి. ఇప్పుడా కల్చర్ గుంటూరుకు సైతం పాకినట్టుంది. ప్రతిపక్షాలనే కాదు స్వపక్షం ప్రత్యర్థులనూ టార్గెట్ చేస్తూ అధికారుల అండతో కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలే ఆరోపించడం ఆసక్తికరం.