తెనాలి నుంనే పోటీ.. పొత్తు ఖాయం.. నాదెండ్ల!
posted on Jun 5, 2023 10:30AM
సరిగ్గా హస్తినలో చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సమయంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్.. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని కుండ బద్దలు కొట్టేశారు. పొత్తు విషయంలో ఇప్పటికే దాదాను విధివిధానాలు ఖరారైపోయాయనీ, సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు.
సీట్ల సర్దు బాటు విషయంలో కూడా ఎటువంటి గందరగోళం లేదనీ, ఆ విషయంలో తుది నిర్ణయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేననీ, ఆయనే సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. దీంతో తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడం ఖాయమేననీ, సీట్ల సర్దుబాటు లాంఛనమేననీ తేలిపోయింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ ఉంటుందా? ఉండదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని కూడా తేటతెల్లమైపోయింది. బీజేపీ ఈ కూటమితో కలవాలని భావించినా సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీది నామమాత్రపు పాత్రేనని కూడా నాదెండ్ల ప్రకటనతో తేలిపోయింది.
నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అన్ని విషయాలలోనూ అండదండగా ఉండి.. ఇప్పుడు వైసీపీ వ్యతిరేకత తమ పార్టీపై పడకూడదన్న ఉద్దేశంతో పొత్తుకు ముందుకు వచ్చినా.. గతంలోలా ఆ పార్టీకి ఈ కూటమిలో సమాన హోదా ఉండే అవకాశం అంతంత మాత్రమేనని కూడా నాదెండ్ల మనోహర్ ప్రకటన తేటతెల్లం చేస్తోంది. హస్తినలో చంద్రబాబు కేంద్ర హోమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరుపుతుంటే.. అదే సమయంలో నాదెండ్ల తెలుగుదేశంతో పొత్తు విషయంలో అనుమానాల్లేవ్ అని చెప్పడంతోనే బీజేపీ కలిసినా కలవకపోయినా పట్టించుకోబోమన్న అర్ధం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక సీట్ల సర్దు బాటు విషయానికి వస్తే ఇప్పటికే పలు సందర్భాలలో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు.
అన్నిటికీ మించి తెనాలి నియోజకవర్గం నుంచి తాను రంగంలో ఉంటానని ప్రకటించడం ద్వారానే సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయ్యిందన్న సంకేతాన్ని నాదెండ్ల ఇచ్చారని అంటున్నారు.