షా నడ్డాలతో చంద్రబాబు భేటీ.. సంకేతం ఏంటి?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తినకేగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వడం ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. గత నాలుగేళ్లుగా తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండ అందించిన ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జగన్ సర్కార్ కు.. ఇక ఈ చివరి సంవత్సరం అంటే ఎన్నికల ఏడాదిలో అలాంటి వెసులుబాటు ఉండదన్న సంకేతాలను ఈ భేటీ ఇచ్చిందనడంలో సందేహం లేదు.

అయితే మీడియాలో, సామాజిక మాధ్యమంలో వస్తున్నట్లుగా పొత్తుల చర్చలు కాదు కానీ.. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న విషయాన్ని విపక్ష నేత, దార్శనికుడు అయిన చంద్రబాబు ద్వారా నేరుగా తెలుసుకునే ఉద్దేశంతోనే  బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాచును హస్తినకు ఆహ్వానించి భేటీ అయ్యిందని ఏపీ బీజేపీ శ్రేణుల్లోని ఒక వర్గం బలంగా చెబుతోంది. జగన్ సర్కార్ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆ వర్గం చెబుతోంది.

ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి జగన్ సర్కార్ పై వాడవాడలా చార్జిషీట్ లు రూపొందించమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా.. పార్టీ హై కమాండ్  పూనుకునేవరకూ ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చని విషయాన్ని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ నాయకుల మీద అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడినా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి నేరుగా విపక్ష నేత నుంచి వివరాలు తెలుసుకోవాలని భావించిందని అంటున్నారు. అందుకే ముందుగా అమిత్ షా తో మాత్రమే బాబు భేటీ అని చెప్పినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చి కలవడంతో వారి మధ్య బేటీ రాజకీయపొత్తుల గురించి కాకుండా.. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకత్వాలపైనే సాగిందని అంటున్నారు. 

దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ నిధులను విడుదల చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్ల రాష్ట్రంలో ఇసుమంతైనా సానుకూలత రాకపోవడం.. అలాగే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ సొమ్ముల విడుదల ద్వారా గట్టెక్కుతుందని మోడీ సర్కార్ భావించినా.. మళ్లీ యధావిథిగా అప్పుల కోసం జగన్ సర్కార్ తిప్పలు పడటం.. కనీసం ఉద్యోగులకు  జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కొనసాగుతుండటంతో... ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుతో భేటీలో అందుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.