తెలంగాణకు దళిత సీఎం

తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే.  కానీ ఆ మాటలు అందరూ మరచిపోయారు. పుష్కరకాలం తరువాత తిరిగి ఆ నినాదం ఊపందుకోబోతోంది. ఈ సారి కేసీఆర్ నోట కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. 

కాంగ్రెస్ పరిస్థితి కర్నాటక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా మారిపోయింది.  ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కి ఉన్న సంబంధం అపురూపమైనది. దేశమంతా  కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమ యంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీని గెలిపించుకున్న ప్రాంతం తెలంగాణ. సహజంగానే కర్నాటక ఫలితాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పడింది. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రెడ్డి
సామాజికవర్గ రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉన్న తెలంగాణలో, అందులో కాంగ్రెస్ లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.  

రెడ్లలో ఉన్న పోటీని నివారించాలంటే ఇతర సామాజిక వర్గాలకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదీకాక గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టాలని, దళిత మహిళను పార్లమెంటు ప్రారంభోత్సవానికి  పిలవని బీజేపీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో పోరు జగమెరిగిన సత్యమే.  రెడ్ల మధ్య పోరును ఆపడానికి దళిత కార్డును కాంగ్రెస్ వినియోగించబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో ఉన్న దళిత నేత ఎవరంటే, విప్లవ పంధా నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనే సమాధానం వస్తోంది. నిజాయితీగా పని చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్న సీతక్క పెట్ట కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కాలంలో తన నియోజకవర్గంలో కాలినడకన ప్రయాణిస్తూ ప్రజలను ఆదుకున్న అడవి బిడ్డ సీతక్క ఇప్పుడు కాంగ్రరెస్ కు ఆశాదీపంగా కనిపిస్తోంది. 

ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బారత్ జోడో యాత్రలో పాల్గొన్న సీతక్క దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయం పెంచుకున్నారు.  రాహుల్ గాంధీ సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం చేయడం వెనుక ఆమెను తెలంగాణ సీఎం పీఠంలో కూర్చోపెట్టే వ్యూహమే ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు.  సీతక్కకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండడం, వివాదాలకు  అతీతంగా వ్యవహరించడం కూడా అమెకు ప్లస్ అనేది కాంగ్రెస్ వాదన. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తూ అధిష్ఠానం కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్లు, రెడ్లు పోరులో దళితులు ప్రయోజనం పొందడం ప్రస్తత తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్