మున్సిపల్ నిర్వాకంతో ఆత్మహత్య
posted on Mar 29, 2015 9:44PM

ఈమధ్యకాలంలో మునిసిపల్ అధికారులు పన్నుల వసూళ్ళ కోసం అత్యంత నీచమైన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఆస్తిపన్నులు చెల్లించని వాళ్ళ ఇంటిముందు చెత్తకుండీలు పెట్టడం, చెత్త ట్రాక్టర్లు నిలపడం, ఇళ్ళముందు చావు డప్పులు మోగించడం లాంటి దారుణమైన పనులు చేస్తున్నారు. ఇలా చేస్తే సదరు పన్ను బకాయిదారులు విసిగిపోయి పన్ను కట్టేస్తారన్నది మున్సిపల్ అధికారుల నీచమైన ఐడియా. ఈ ఐడియాని మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో అమలు చేశారు. ఈ విషయంలో హైకోర్టులో ఫిర్యాదు చేస్తే హైకోర్టు జీహెచ్‌ఎంసీకి మొట్టికాయలు వేసింది. దాంతో జీహెచ్ఎంసీ ఈ ఆటవిక విధానాన్ని పాటించడం ఆపింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ దుర్మార్గ విధానం ఇంకా అమల్లోనే వుంది. ఈ దారుణమైన విధానం ఇప్పుడు ఒక ప్రాణం పోవడానికి కారణమైంది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్ఎస్ పేటలో మున్సిపల్ అధికారులు ఇంటిపన్ను చెల్లించలేదన్న సాకుతో ఆ ఇంటి ముందు చెత్త ట్రాక్టర్ని నిలిపారు. దాంతో మనస్తాపానికి గురైన ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.