తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు.. మోడీయే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల విషయమై గత ఏడాదిగా  ఏదో ఒక రూపంలో చర్చ సాగుతూనే ఉంది. కూటములు, సమీకరణాల విషయంలో విపక్షాలను కన్ఫ్యూజ్ చేయడానికో, లేక సొంత క్యాడర్ ను అలర్ట్ గా ఉంచడానికో అధికార వైసీపీ అగ్రనాయకత్వమే ఈ చర్చను సజీవంగా ఉంచింది. ముందస్తు చర్చ వెనక్కు వెళ్లకుండా వ్యూహాత్మకంగా జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని తాజాగా ఉంచుతూ వచ్చారు. ఇప్పుడిక ఏపీ అసెంబ్లీ గడువు ముగియడానికి ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది.

అయితే ఇప్పుడు ముందస్తు ముచ్చట మళ్లీ బలంగా తెరమీదకు వచ్చింది. అయితే ఈ సారి ఇందులో ఎలాంటి వ్యూహం లేదు. మొత్తం ములిగిపోవడమో.. ముందస్తుతో అదృష్టాన్ని పరిశీలించకోవడమో తప్ప మరో దారి లేని పరిస్థితికి జగన్ సర్కార్ చేరిపోయింది. దీంతో ఈ సారి స్వయంగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికల విషయంలో సీనియస్ గా ఆలోచిస్తున్నారు. అందులో భాగమే ఈ నెల 7 కేబినెట్ భేటీ అని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉండటమో, సంక్షేమ పథకాలు కొనసాగించలేని నిస్సహాయతో.. పార్టీలో పెల్లుబుకుతున్న అసంతృప్తో, జనంలో వ్యక్తమౌతున్న ఆగ్రహమో జగన్ సర్కార్ ముందస్తుకు తహతహలాడేందుకు కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి జగన్ సర్కార్ ముందస్తుకు వెళ్లడానికి తెరమీదకు వచ్చిన కారణం ప్రధాని మోడీ.  

అవును ప్రధాని మోడీయే జగన్ ముందస్తుకు తొందరపడటానికి కారణమని అంటున్నారు. ఇంతకీ విషయమేమిటంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలన్న పట్టుదలతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ చేయగలిగినంతా చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోజుల తరబడి రాష్ట్రంలో క్యాంపు చేసి ప్రచారం చేశారు. ఎప్పడూ ఫ్రీబీస్ (ఉచితాలు) దేశానికి మంచివి కావు అంటూ  ప్రతి వేదికమీదా ఉద్ఘాటించే  మోడీ, కర్నాటక బీజేపీ ఎన్నికలలో గెలిస్తే ఇవి ఉచితం.. అవి ఉచితం అంటూ ఏకంగా మేనిఫెస్టోలోనే పొందుపరిచినా కిమ్మనలేదు. పైగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనతో విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ స్వయంగా తన ప్రసంగాలలో వాటినే ప్రముఖంగా చెప్పారు. అవి చాలవనుకున్నారో ఏమో.. హిందుత్వ ఎజెండాను కూడా అన్ని భేషజాలూ వదిలేసి మరీ భుజానికెత్తుకున్నారు. ది కేరళ స్టోరీ సినిమాను ప్రమోట్ చేశారు. బజరంగ్ భళి నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీకి ఓటెసి బజరంగ్ నినాదం చేయడంని పిలుపు  నివ్వడానికి కూడా మోడీ వెనుకాడలేదు. అ

యినా కర్నాటకలో బీజేపీకి పరాభవం తప్పలేదు. అంతే కాకుండా కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై యాంటీ ఇన్ కంబెన్సీ ప్రభావం తీవ్రంగా ఉందని పరిశీలకులు  సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభావం తగ్గుతోందనడానికి కర్నాటక ఫలితాలను చూపుతున్నారు. ఇక అన్నిటికీ మించి ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం ఏపీలో వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండగా ఉందన్న సంగతి ఏపీ ప్రజలలో బలంగా నాటుకుందంటున్నారు. దీంతో షెడ్యూల్ ప్రకారమే.. అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే..ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న ఆగ్రహానికి మోడీ వ్యతిరేకత కూడా తోడై జమిలిగా మునిగిపోవడం ఖాయమని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఆ కారణంగానే ఇటీవలి హస్తిన పర్యటన జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి ఓకే చేయించుకున్నారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.   దీంతో మోడీ వ్యతిరేకత తన సర్కార్ పై పడకుండా ఉండాలంటూ సార్వత్రిక ఎన్నికల వరకూ వేచి చూడకుండా ముందస్తు ఎన్నికలకు వెడితేనే ఏదో ఒక మేరకు ప్రయోజనం ఉంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు చెబుతున్నారు.