రెజ్లర్ల ఆందోళన.. మసకబారుతున్న మోడీ ప్రతిష్ట

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్  భూషణ్ పై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లపైనే దాష్ఠీకాలు జరుగుతున్న తీరు మోడీ ప్రతిష్టను నిలువునా ముంచేస్తున్నది. గత 41 రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై కేంద్రం కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనకు మద్దతూ పెరుగుతోంది.

ఈ మద్దతు కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వస్తుండటం.. మోడీ ప్రతిష్టను విదేశాలలో కూడా మసకబారుస్తోంది. తాజాగా భారత మహిళా రెజ్లర్ల ఆందోళనపై  యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్  స్పందించింది. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో మార్చ్ చేపట్టిన రెజ్లర్లపై పోలీసులు వ్యవహరించిన తీరును నిర్ద్వంద్వంగా ఖండించింది. అలాగే భాతర మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలనీ, అలాగే నెలన్నర రోజులలో ఎన్నికలు నిర్వహించకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేస్తామనీ హెచ్చరించింది.  

అదలా ఉంటే.. 41 రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా   ఏప్రిల్ నుంచి తాము ఉద్యమిస్తున్నా.. బ్రిజ్ భూషణ్ పై చర్యల విషయంలో   పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమైన  రెజ్లర్లు  చివరి క్షణంలో ఖాప్ రైతు సంఘాల నేతల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని విరమించుకుని కేంద్ర ప్రభుత్వానికి మరో ఐదు రోజుల గడువు ఇచ్చారు. భారత రెజ్లర్ల ఆందోళనకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. దేశ వ్యాప్తంగా వారి ఆందోళనకు మద్దతుగా మహిళాలోకం గళమెత్తుతోంది. అలా గళమెత్తుతున్న వారిలో కేంద్రంలోని మహిళా మంత్రులు లేకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది.

సామాజిక మాధ్యమంలో నెటిజన్లు యూనియన్ కేబినెట్ లోని మహిళా మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఒలింపిక్స్ లో రాణించి దేశానికి పతకాలు సాధించిన మహిళా రెజ్లర్ల పట్ల మీరు ప్రవర్తించాల్సిన తీరిదేనా అని నిలదీస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను వదిలేసి రెజ్లర్లపై కేంద్రం దమనకాండ ప్రదర్శించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా.. రెజ్లర్ల ఆందోళనకు దేశ, విదేశాల నుంచి మద్దతు పెరుగుతుంటే.. కేంద్రం, పోలీసులూ మాత్రం బ్రిజ్ భూషణ్ ను వెనకేసుకురావడంలో పోటీ పడుతున్నారు.

తాజాగా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవంటూ ట్వీట్ చేశారు. అలా ట్వీట్ చేసిన వెంటనే దానిని డిలీట్ చేశారు. ప్రజా వ్యతిరేకత, ఆగ్రహానికి దడిసి ఢిల్లీ పోలీసులు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే బ్రిజ్ భూషణ్ విషయంలో పోలీసుల తీరును ఆ ట్వీట్ తేటతెల్లం చేసింది. రెజ్లర్ల ఆరోపణలను బలపరిచే సాక్ష్యాలేవీ లేకపోవడం వల్లే బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయలేదంటున్న పోలీసులు.. ఆయనపై నమోదైన కేసులో ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉందని మాత్రం అంగీకరిస్తున్నారు.