జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మేయర్ బొంతు రామ్మోహన్ భార్యకు చేదు అనుభవం
posted on Nov 25, 2020 12:14PM
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న పలు పార్టీల ముఖ్య నాయకులు, అభ్యర్థులకు గత కొద్ది రోజులుగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఓట్ల కోసం మాత్రం తమ గల్లీల్లోకి వస్తున్నారంటూ నేతలు, అభ్యర్థులపై బస్తీల వారు మండిపడుతూ.. వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. తమ కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేవని, నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి వెళ్తున్నారు కానీ వాటిని అమలు చేయడం లేదని పలు కాలనీ వాసులు నాయకులను మొహం మీదే అడిగేస్తున్నారు. దీంతో ప్రజలకు నేతలు నచ్చచెప్పలేక సతమతమౌతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు ఆమె కుషాయిగూడలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. అయితే, వరద సాయంపై స్థానిక మహిళలు ఆమెను అక్కడే నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.