పోలీసుల విచారణకు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల

జన్వాడ పార్టీ రేవ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మద్దూరీ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని రాజ్ పాకలను కోర్టు  ఆదేశించింది. దీంతో  పోలీసులు రాజ్ పాకాలకు బుధవారం (అక్టోబర్ 30) విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసు మేరకు రాజ్ పాకాల తన న్యాయవాదితో కలిసి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. 

ఇలా ఉండగా ఇదే కేసులో విజయ్ మద్దూరి అనే వ్యాపార వేత్త నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని విజయ్ మద్దూరి నివాసంలో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. జన్వాడ పార్టీలో విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.  మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు తేల్చుకున్న పోలీసులు ఆయనక కొకైన్ ఎలా ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంలో ఆరా తీస్తున్నారు. విచారణలో విజయ్ మద్దూరి స్వయంగా తనకు కొకైన్ రాజ్ పాకాల ఇచ్చినట్లు చెప్పారని పోలీసులు ఎప్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే విజయ్ మద్దూరి ఆ విషయాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో విజయ్ మద్దూరి నివాసంలో పోలీసుల సోదాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.