తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడంటే?
posted on Oct 30, 2024 11:14AM
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే పలు మార్లు కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చినప్పటికీ విస్తరణకు మాత్రం ముహూర్తం ఖరారు కాలేదు. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లి వచ్చారు. అయినా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అదే సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. దీంతో ఆశావహుల్లో అసంతృప్తి పేరుకుపోతున్నది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై కీలక సమాచారం ఇచ్చారు. పార్టీ హైకమాండ్ తో చర్చించి మహారాష్ట్ర ఎన్నికల తరువాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. రేవంత్ మంత్రివర్గ విస్తరణపై ఇచ్చిన సమాచారంతో అశావహుల్లో సందడి మొదలైంది. కేబినెట్ బెర్త్ కోసం తమ వంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేశారు.
గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త్వరాత మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల కారణంగా హైకమాండ్ రాష్ట్ర మంత్రివర్గంపై దృష్టిపెట్టలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. అయితే ఆ ఎన్నికలు పూర్తై ఫలితాలు వెలువడిన తరువాత మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తో చర్చించి అనుమతి తీసుకునేందుకు రేవంత్ హస్తిన వెళ్లి వచ్చారు. దీంతో అప్పట్లో కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు తాము చేశారు. కానీ కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. ఇప్పుడు రేవంత్ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల అనంతరం తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు చెప్పడంతో మళ్లీ ఆశావహులు ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాలన బేరీజు వేస్తూ తమకు ఉన్న అవకాశాలపై సన్నిహితులతో చర్చోపచర్చలు చేస్తున్నారు.