గ్రేటర్లో భూపేంద్ర మార్క్! ఉక్కిరిబిక్కిరవుతున్న టీఆర్ఎస్
posted on Nov 25, 2020 12:04PM
దుబ్బాకలో గెలిచేశాం.. జీహెచ్ఎంసీపై జెండా పాతేద్దాం.. మూడేళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుందాం.. ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నినాదం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రేటర్ ఎన్నికను సవాల్ గా తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఎట్టి పరిస్థిత్తుల్లోనూ బల్దియా పీఠాన్ని చేజిక్కించుకునేందుకు పకడ్బంధి ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో పార్టీకి ట్రబుల్ షూటర్ గా ఉన్న భూపేంద్రయాదవ్ ను ఇంచార్జ్ గా నియమించింది. హైకమాండ్ ఆదేశాలతో హైదరాబాద్ లోనే మకాం వేసిన భూపేంద్ర యాదవ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఎవరికి అంతుపట్టని అలోచనలు, సరికొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నారు. గ్రేటర్ ప్రచారంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఈజీగా వెళుతుండటంతో ప్రత్యర్థి పార్టీలు కలవరపడుతున్నాయని తెలుస్తోంది. భూపేంద్ర యాదవ్ ప్రచార వ్యూహాలతో అధికార గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని చెబుతున్నారు.
గ్రేటర్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. గ్రేటర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతున్న బీజేపీ.. చేంజ్ హైదరాబాద్ పేరుతో సభలు నిర్వహిస్తోంది. గ్రేటర్ నగరాన్ని మారుస్తామని, భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామని చేంజ్ హైదరాబాద్ అంటూ యాప్ ను కూడా ప్రారంభించింది. ముఖ్యంగా యువతను, అకట్టుకునేందుకు ‘చేంజ్ హైదరాబాద్’ కార్యక్రమం కోసం బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, యువ ఎంపీ తేజస్వి సూర్యను ప్రచారంలోకి దింపింది బీజేపీ. హైదరాబాద్ ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు సూర్య. తెలంగాణ సెంటుమెంటును కూడా తమవైపు తిప్పుకునేందుకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్లి చరిత్రాత్మక ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉత్తేజపూరిత ప్రసంగం చేస్తూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు తేజస్వి సూర్య.
క్లీన్ పాలిటిక్స్ పేరుతో గ్రేటర్ లో మరో వినూత్న ఆలోచన చేసింది బీజేపీ. కార్పోరేటర్ గా పోటీచేస్తున్న అభ్యర్థితో ప్రజల సమక్షంలోనే ప్రమాణం చేయిస్తోంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి చేతన హరీష్ ప్రజల సమక్షంలో ప్రమాణ పత్రం చదివారు. తాను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ప్రజల సమక్షంలో కార్పొరేటర్ అభ్యర్థిని దైవ సాక్షిగా ప్రమాణం చేసింది. ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు అభ్యర్థిచేత ప్రజా క్షేత్రంలోనే ప్రమాణం చేయిస్తున్నామని .. ఇది ఓటర్లను బాగా ఆకర్శిస్తుందని చెబుతున్నారు కమలం నేతలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి బాగా ఉపయోగపడిన నేతల బస్తినిద్ర కార్యక్రమాన్ని గ్రేటర్ లోనూ అమలు చేస్తోంది బీజేపీ. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రాత్రి వరకు సాగించిన అనంతరం ప్రచారం ముగిసిన ప్రాంతంలోనే ఆ రాత్రి ఆ బస్తీలోనే నాయకులు నిద్రిస్తున్నారు. దీని ద్వారా స్థానికుల్లో బీజేపీ ప్రజల పార్టీయని, ప్రజల్లోనే ఉంటుందన, ప్రజాభివృద్దిని కోరుకుంటుందనే సంకేతాలను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
చేంజ్ హైదరాబాద్, బస్తి నిద్ర, క్లీన్ పాలిటిక్స్ తరహాలోనే మరిన్ని ప్రయోగాలు భూపేంద్ర యాదవ్ అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎంఐఎం పార్టీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ హిందువుల ఐక్యతను బలంగా వినిపిస్తోంది కమలదళం. రోడ్ షోలు కొనసాగిస్తూనే.. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై , సీఎం పనితీరుపై, కేటీఆర్ ప్రకటనలపై, నగర పరిస్థితులపై బీజేపీ అరోపణలు సంధిస్తోంది. భూపేంద్ర యాదవ్ వ్యూహాలతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెరిగిందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలకు ప్రచారం కోసం ఎక్కువ సమయం ఉండవద్దనే ఉద్దేశంతో గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ను హడావుడిగా ఇచ్చినా.. భూపేంద్ర ఎత్తులతో అధికార పార్టీ పాచికలు పారడం లేదంటున్నారు. ప్రచారం ముగిసేలోగా భూపేంద్ర ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారోనన్న ఆసక్తి గ్రేటర్ బీజేపీ నేతలతో పాటు నగర ప్రజల్లోనూ కనిపిస్తుందని చెబుతున్నారు.