విజయమ్మ లేఖ ఎఫెక్ట్ .. జగన్ కు దూరం జరుగుతున్న వైఎస్ అభిమానులు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబపరంగానూ, రాజకీయంగానూ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని స్థాపించినప్పుడు ఆయనకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ అభిమానులందరి మద్దతూ లభించింది. ఇటు కుటుంబం కూడా ఆయన వెన్నంటి నడిచింది. ఇలా అన్ని వైపుల నుంచీ, అందరి నుంచీ మద్దతు లభించడం వల్లనే  ఆయన తన వైసీపీ పార్టీని ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ నడపగలిగారు, 2019 ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగారనడంలో సందేహం లేదు. అందుకే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలు విమర్శలు చేసినా, మంచీ మర్యాదా వదిలేసి అప్పటి ముఖ్యమంత్రిపై దుడుకుగా, దురుసుగా విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో అనుమతించలేని, అనుమతించరాని బెదరింపులకు పాల్పడ్డారు. 

ఇక 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం అండతో ఆయన చెలరేగిపోయారు. ఇంత కాలం తనకు అండగా నిలిచిన కుటుంబాన్నీ కాదనుకున్నారు. చెల్లి షర్మిలను పార్టీ నుంచి బయటకు పంపేశారు. తల్లి విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపారు. తండ్రి వైఎస్ మరణం తరువాత ఆయన మరణం ద్వారా వచ్చిన సానుభూతిని నమ్ముకుని జగన్ రాజకీయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు. అయితే తండ్రి మరణం తరువాత 2014 లో జరిగిన ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర విభజన కారణంగా ఆ పరాజయం ఎదురైందని సర్ది చెప్పుకున్న జగన్.. ఆ తరువాత ఐదేళ్లూ కూడా సీఎం పీఠం అధిరోహించడమే లక్ష్యంగా పని చేశారు. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తన పార్టీ సిద్ధాంతాలను నమ్ముకోలేదు. అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి, ఐప్యాక్ సహకారంతో విధ్వంస, విద్వేష వ్యూహాలను అమలు చేసి విజయం సాధించారు.

కోడికత్తి దాడి, సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సానుభూతిని అలంబనగా చేసుకుని జగన్ అధికార పీఠం అధిరోహించారు.  అయితే 2024 ఎన్నికలు వచ్చే సరికి జగన్ కు నాడు సానుభూతి వెల్లువెత్త విజయం సాధించడంలో కీలకంగా ఉన్న రెండు సంఘటనల్లోనూ జగన్ కుట్ర ఉందన్న అనుమానాలు బలపడ్డాయి. ఆ రెండు కేసుల దర్యాప్తులోనూ జగన్ మేలు కోసం ఆయన పార్టీకి చెందిన వారి ప్రోద్బలం, ప్రమేయంతోనే ఈ ఘటనలు జరిగాయని నిర్ధారణ అయ్యింది.  సొంత తల్లి, చెల్లీ కూడా జగన్ కు ఆయన పార్టీకీ దూరమయ్యారు. అరాచక పాలన కారణంగా ఐదేళ్ల కిందట బ్రహ్మరథం పట్టిన జనం ఛీకొట్టారు.  దాంతో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. అధికారం కోల్పోయారు. 
ఇప్పుడు తాజాగా షర్మిల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుతో వైఎస్ కుమారుడిగా ఆయనను అభిమానిస్తున్న వారు కూడా దూరం అవుతున్నారు. వైఎస్ అనుయాయులుగా, ఆయనకు అత్యంత విధేయులైన పలువురు నేతలు గతంలో జగన్ కు అండగా నిలిచారు. పార్టీ పరాజయం తరువాత కూడా వారు వైఎస్ మీద అభిమానంతో జగన్ తోనే ట్రావెల్ చేస్తున్నారు.

ఎప్పుడైతే ఆస్తుల వివాదంలో జగన్ షర్మిల మధ్య వివాదం రచ్చకెక్కిందో, సొంత చెల్లిపై కూడా జగన్ మీడియా విమర్శల దాడి చేయడం ప్రారంభించిందో వారు జగన్ కు దూరం కావాలని నిర్ణయించుకున్నారు.  ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్ప‌నున్నారు. ఆయన దారిలోనే పలువురు నేతలు ఉన్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఆస్తుల వివాదంలో షర్మిలకు మద్దతుగా నిలబడి విజయమ్మ ఎప్పుడైతే జగన్ నమ్మకద్రోహాన్ని లోకానికి చాటుతూ బహిరంగ లేఖ రాసిన తరువాత జగన్ కూ దురం అయ్యే వైఎస్ అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. ఇక రాజకీయంగా జగన్ కు ఎటువంటి మద్దతూ ఇచ్చే ప్రశక్తి లేదని వారు బాహాటంగానే చెబుతున్నారు.