గోదావరికి వరద.. పాపికొండల విహార యాత్రకు బ్రేక్!

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పాపికొండలకు వెళ్లే మార్గంలో బోట్లను టూరిజం అధికారులు నిలిపివేశారు.

మళ్లీ ప్రకటించేంత వరకూ ఈ మార్గంలో బోట్ల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా ఉండగా దేవీపట్నం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. ధవళేశ్వరం, భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్నది.

ఏపీలో వచ్చే మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదవరి పరీవాహక ప్రాంతాలలో నిఘా పెంచారు. ఎటిగట్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ చేశారు.