మావోయిస్టుల దగ్గర డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లు! తెలంగాణలో పంజా విసరబోతున్నారా?

తెలంగాణలో మావోయిస్టులు బలోపేతం అయ్యారా? పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా ? అంటే కొన్నిరోజులుగా ఏజెన్సీలో వెలుగుచూస్తున్న ఘటనలతో నిజమనే సమాధానమే వస్తోంది. తాజాగా ములుగు జిల్లాలో బయటపడిన మావోయిస్టుల డంప్ తో పోలీసు శాఖ కలవరపడుతోంది. ఖాళీ బీరు బాటిళ్లు..వెదురు బొంగులతో మావోయిస్టులు బాంబులు తయారు చేస్తున్నట్లు బహిర్గతమైంది. డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లను మావోయిస్టులు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఐఈడీలను రూపొందిస్తున్నట్లు అక్కడ దొరికిన వస్తువులను బట్టి తెలుస్తోంది. ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ కావడంతో ఖాళీ బీరు బాటిళ్లు.. వెదురు బొంగులతో మైన్లను తయారు చేస్తున్నారని ములుగు పోలీసులు అంచనాకు వచ్చారు. నిఘా పెరగడంతో పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడంతో.. అడవిలో  లభించే వస్తువులతోనే బాంబులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.  

ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో భద్రతా దళాలే లక్ష్యంగా కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా ల్యాండ్‌ మైన్‌లను పాతుతున్న మిలీషియా కమాండర్‌, డిప్యూటీ కమాండర్‌ సహా.. ఏడుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లవిచారణలో ఈ కీలక విషయాలు తెలిశాయంటున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో మిలీషియా కమాండర్‌ ఉండుం పాండు, డిప్యూటీ కమాండర్‌ ముచ్చిక భీమయ్య, మిలీషియా సభ్యులు సోడి లక్ష్మయ్య, మాడవి అడమయ్య, మాడవి భుద్ర, మాడవి ఐతయ్య, మాడవి కోసగా గుర్తించారు. వీరంతా జెల్ల, పామునూరు, చెలిమల గ్రామాలకు చెందినవారు. దర్యాప్తులో వీరంతా.. తాము మావోయిస్టు అగ్రనేతలు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఆదేశాలతో బాంబులను అమరుస్తున్నట్లు అంగీకరించారు.

పట్టుబడిన మిలీషియా టీమ్ నుంచి తొమ్మిది ల్యాండ్‌మైన్స్‌, 80 మీటర్ల కార్డెక్స్‌ వైర్‌, 50 డిటోనేటర్లు, వాకీటాకీ, వెదురు బొంగుతో పేల్చే డైరెక్షనల్‌ మైన్‌, నాలుగు బాణాలు, 8 విల్లులు, కరెంటు వైర్‌,బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ తెలిపారు. బీరు బాటిళ్లు, వెదురు బొంగులతో తయారు చేసిన బాంబులతో కూడా విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నారనే విషయం మిలీషియా సభ్యుల విచారణలో వెల్లడైందని వివరించారు. సాధారణ ల్యాండ్‌ మైన్‌ 3 నుంచి 4 కిలోల బరువు ఉంటే.. బొంగులతో తయారు చేసేవాటి బరువు చాలా తక్కువ. అడవుల్లో ఒకచోటి నుంచి మరో చోటికి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. డైరెక్షనల్‌ మైన్స్‌కూడా ఎక్కువ బరువు ఉంటాయి. వాటి స్థానంలో వెదురుతో తయారు చేసినవి బరువు తక్కువగా.. తయారు చేయడం సులభంగా ఉంటుంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. చర్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని  ఇంద్రావతి దళ సభ్యురాలు పద్దం మున్ని అలియాస్‌ అలియాస్‌ నిర్మల, మావోయిస్టు కొరియర్‌ జర్సుల బన్సీగా గుర్తించారు.

గతంలో తెలంగాణ మావోయిస్టులకు కేంద్రంగా ఉండేది, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలో మావోయిస్టులకు పట్టు ఉండేది. అప్పట్లో ఏజెన్సీ గ్రామాలన్ని భయం నీడలో ఉండేవి.మావోయిస్టుల సంచారం, పోలీసుల కూంబింగ్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపించేంది. ఎన్ కౌంటర్లు భారీగా జరిగేవి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు కదలికలు పెద్దగా లేవు. అయితే గడిచిన ఏడాది కాలంగా తిరిగి మావోయిస్టులు తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అరాచక పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు ఎక్కువయ్యాయనే విమర్సలు వస్తున్నాయి. దొరలు,భూస్వాములు మళ్లీ గ్రామాల్లోకి చేరి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పెదపల్లి జిల్లాలో ఇటీవలే జరిగిన న్యాయవాద దంపతుల
హత్య కలకలం స్పష్టించింది. ప్రశ్నించే వారే టార్గెట్ అవుతున్నారు. 

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లోనూ అసహనం కన్పిస్తోంది. దీన్నే అస్త్రంగా చేసుకుని మళ్లీ బలోపేతం కావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కొంత కాలంగా భారీగా రిక్రూట్ మెంట్ జరిగిందనే సమాచారం వస్తోంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉండటం వల్లే ఏజెన్సీలో పోలీసుల మోహరింపు పెరిగిందంటున్నారు. గత ఏడాది డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా అదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు మావోయిస్టుల కదలికలపై కేంద్రం హెచ్చరికలతో ఛత్తీస్ గడ్, తెలంగాణ , సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. మొత్తంగా మావోయిస్టుల కదలికలు పెరగడంతో తెలంగాణలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.