పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు
posted on Aug 25, 2015 12:52PM
“పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు” తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సీపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అన్నమాట ఇది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కేసీఆర్ ఒక నయా నిజాం నవాబు” అని ఆయన అభివర్ణించారు. కానీ కేసీఆర్ ని ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వర్ రావు, చిన్న జియ్యర్ స్వామే వెనుకనుండి నడిపిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు తెలంగాణాలో ఆంధ్రా నేతల పాలన సాగేదని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కుల పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, నిజాం దొరలపాలనా సాగుతోందని అన్నారు.
రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళు, మూడెకరాల స్థలం హామీని పక్కనబెట్టి బడా పారిశ్రామిక వేత్తలకు స్థలాలు అన్వేషించడానికి కేసీఆర్ స్వయంగా హెలికాఫ్టర్లో తిరుగుతున్నారని హరిభూషణ్ ఆరోపించారు. పేదలకు 100 గజాల స్థలం ఇవ్వడానికి వెనుకాడే కేసీఆర్ పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు, కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా 1.60 లక్షల ఎకరాల భూమిని సిద్దం చేసామని గొప్పగా చెప్పుకోవడాన్ని హరిభూషణ్ తప్పు పట్టారు. ఒకవైపు పోలీసులకు అత్యదునిక ఆయుధాలు, వాహనాలు సమకూర్చి మావోయిస్టులను భూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మళ్ళీ తమ ప్రభుత్వం మావోయిస్ట్ అజెండానే అమలు చేస్తోందని కేసీఆర్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అధికారంలోకి రావడానికే కేసీఆర్ తమపెరును వాడుకోన్నారని హరిభూషణ్ అన్నారు. రాష్ట్రంలో పేదలకు కూడు, గుడ్డ, ఇళ్ళు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పించినప్పుడే ఆ మాట చెప్పుకొనే అర్హత ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పేదల కోసం పనిచేయకుండా కేసీఆర్ తన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను ఏర్పాటు చేసుకొంటున్నారని హరిభూషణ్ విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయవలసిన సొమ్మును చిన్న జీయర్ స్వామీ సలహాతో కేసీఆర్ గుళ్ళు గోపురాలకి(యదాద్రి), పుష్కరాలకి ఖర్చు చేస్తున్నారని ఆవేదన చెందారు. నిరుపేద మునిసిపల్ కార్మికులు, ఈజీఎస్ ఉద్యోగుల సమ్మెను కేసీఆర్ ఉక్కుపాదంతో అణచివేశారని హరిభూషణ్ విమర్శించారు. చివరికి తనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలని, మీడియాని కూడా కేసీఆర్ నియంతలాగా అణగద్రొక్కేస్తున్నారని హరిభూషణ్ అన్నారు.
తెలంగాణా భౌగోళికంగా ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ఆంధ్రా భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో నుండి ఇప్పుడు నయా నిజాం దొరల వంటి కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కుకుపోయిందని హరిభూషణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేతిలో నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు మళ్ళీ మరొక ఉద్యమం అవసరం అవుతుందని హరిభూషణ్ అభిప్రాయ పడ్డారు.