రాష్ట్రపతి ఎన్నిక.. ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు
posted on Jun 11, 2022 8:13AM
కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికలలో రాణించి పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకోవాలంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఏదో మేర ప్రభావం చూపించాల్సిందేనని తలపోసిన సోనియా గాంధీ బీజేపీయేతర రాజకీయ పార్టీలతో చర్చలకు ఉపక్రమించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆమె రంగంలోకి దిగారు.
ఒక వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తమ అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా షెడ్యూల్ విడుదలకు ముందే కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పుడు షెడ్యూల్ వెలువడిన అనంతరం కాంగ్రెస్ అధినేత్రి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ పార్టీల అధినాయకత్వానికి స్వయంగా ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్మర్థిని పోటీలో నిలబెట్టే విషయంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ కరోనాతో బాధపడుతూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కారణంగా ఆమె ప్రయత్నాలను ఫోన్ చర్చలకు మాత్రమే పరిమితమైనా తదుపరి బాధ్యతను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదించేందుకు మల్లికార్జున్ ఖర్గే ఇక రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.
శరద్ పవార్ తో సోనియా ఫోన్ లో మాట్లాడిన అనంతరం ఖర్గే ముంబైలో శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అలాగే డీఎంకే, టీఎంసీ, శివసేన పార్టీల అధ్యక్షులతోనూ త్వరలో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ యేతర పార్టీలన్నిటితో చర్చించి రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామనీ, ఆ అభ్యర్థి ఎవరన్నది పార్టీలతో చర్చల తరువాత ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీయేతర పార్టీలకు నేతృత్వం వహించి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే లేదు. ఎన్నికలలో వరుస ఓటములతో ఎలక్టోరల్ కాలేజీలో ఆ పార్టీకి ఉన్న ఓట్ల విలువ బహుస్వల్పం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే కొన్ని ప్రాంతీయ పార్టీలకే ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓటు విలువ ఉంది.
దీంతో ఉమ్మడి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ చర్చల ప్రక్రియ ప్రారంభించినా.. నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితిలో అయితే లేదు. ఇక బీజేపీయేతర పార్టీలు అన్నీ ఒకే గూటి కిందకు రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం అన్నది ఖాయమైంది. అలాగే ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కూడా ఎన్డీయే అభ్యర్థివైపే మొగ్గు చూపుతుందన్న స్పష్టత ఇచ్చేసింది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో తన వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ వెల్లడించకపోయినా.. ఆ పార్టీ అధినేత చొరవ తీసుకుని ముందుగా చేసిన ప్రయత్నాలకు స్పందన కరవవ్వడంతో ఆయన ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఏదో విధంగా రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్ఎస్ దూరంగా ఉండేలా ఆయన నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24వ తేదీతో పూర్తి కానుంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేని కారణంగా ఎన్డీయే పక్షాలు కూడా ఆత్మప్రభోదం మేరకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నది. సాక్షాత్తూ బీజేపీలోనే మోడీ విధానాలను, వైఖరిని వ్యతిరేకించే ఎంపీల సంఖ్య అధికంగానే ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది.