మహాజన ప్రభంజనం.. మహానాడు

రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పండుగ మహానాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రజల ముందు ఉంచింది. మే నెల 27, 28 తేదీలలో జరిగిన తెలుగుదేశం వార్షిక ప్రతినిథుల సభ, బహిరంగ సభలు ఆ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ ను నింపాయి.  27వ తేదీన సుమారు 15వేల మంది హాజరౌతారని అశించిన ప్రతినిథుల సభకు 40 వేల మందికి పైగా హాజరు కావడంతో ప్రతిపక్ష తెలుగుదేశంలో ఆనందం, అధికార వైసీపీలో గుబులు ఒక్కసారిగా బయటపడ్డాయి.  తెలుగుదేశం పార్టీ ఆ జోష్ ను రెండు రోజుల పాటు కొనసాగించగా, వైసీపీ తన అక్కసును అనేక రకాలుగా ప్రకటిస్తూనే వచ్చింది. 

రాజమండ్రి శివారు ప్రాంతమైన వేమగిరిలో జరిగిన రెండు సభలూ సూపర్ హిట్ కావడంతో పసుపు క్యాడర్ లో  పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో వైపు పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడటం కనిపించింది. ముందు రోజు నుండీ ఫ్లెక్సీలు చించివేయడం, సభలకు స్థలాన్ని ఇచ్చిన వారిని బెదరించడంతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరౌతున్న సభలకు అంబులెన్సులను ఇచ్చే వారిని కూడా వైసీపీ నేతలు బెదరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇన్ని అవరోధాల మధ్య మహానాడు మహా విజయాన్ని స్వంతం చేసుకుంది.

రాజమండ్రి నగరంలో, సభలు జరిగే చోట భారీ వాహనాలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ సమస్యను సృష్టించారని స్థానిక టీడీపీ నేతలు వైసీపీ  నేతలపై, ప్రభుత్వ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడం కూడా కనిపించింది. 

ఇన్ని అవాంతరాల మధ్య రెండు రోజుల పాటు సాగిన మహానాడు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రతినిథుల మహాసభల దాదాపు ప్రతి నాయకుడూ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు.  27వ తేదీన ప్రతినిథుల మహా సభలో పార్టీ ముఖ్యులు చేసిన ప్రసంగాలు పార్టీ ప్రతినిథులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిథులు రావడంతో సభకు నిండుదనం చేకూరింది.  సుమారు  40 డిగ్రీల ఎండ కాస్తున్నా లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా సాగిన ప్రతినిథుల మహా సభ పార్టీలోని క్రమశిక్షణను చెప్పకనే చెప్పింది.
ప్రతినిథుల సభలో అధినేత చంద్రబాబు ప్రసంగం హైలైట్ గా నిలిచింది. కౌరవులను ఓడించి గౌరవ సభలోకి అడుగుపెడతానని బాబు చెపపినపుడు ప్రతినిథుల సభ హర్షం వ్యక్తం చేసింది. అదే రోజు సాయంత్రం జరిగిన జాతీయ అధ్యక్షుడి ఎన్నికల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రానున్న ఎన్నికలలో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తామని, క్రమశిక్షణ పాటించని నాయకులను పార్టీ ఆదరించే ప్రశ్నే లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.  మొత్తం 19 తీర్మానాలను ఆమోదించారు.

 28వ తేదీన జరిగిన భారీ బహిరంగ సభ పార్టీ పట్టును మరోసారి తెలిపింది. లక్షల మంది హాజరైన ఈ సభలో పార్టీ అధినేత మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రకటించిన మానిఫెస్టో రానున్న ఎన్నికలలో విజయానికి తొలి సంకేతమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 
మినీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చేసిన ప్రకటనల్లో ఎ క్కడా వ్యక్తుల పేర్లను పథకాలకు పెట్టలేదు.  18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిథి, చదువుకునే పిల్లల తల్లులకు తల్లికి వందనం, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు వసతి, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల భృతి ఈ మినీ మేనిఫెస్టోలో ముఖ్యమైనవి. ఇవి కాక అధికారం ఉండే ఐదేళ్లలో 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించే బాధ్యత తనదేనంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు తెలుగుదేశం శ్రేణులకు అమితానందాన్ని కలిగించాయి.  

ఏది ఏమైనా రాజమహేంద్రవరం మహానాడు తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, శ్రేణులకు ఒక మధుర జ్ణాపకంగా నిలిచిపోనుంది. 2023 మహానాడు స్ఫూర్తితో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి తెలుదండు జిల్లాలకు తరలివెళ్లింది.