ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ ప్లాన్
posted on May 29, 2023 5:46PM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అమెరికాలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ బిఆర్ఎస్ కు వెళ్లిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం బిఆర్ఎస్ అని ప్రచారం చేసుకుంటుంది.
వచ్చే నెల రెండున అమెరికా టెక్సాస్ లో జరిగే వేడుకలకు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిధులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇటీవలె కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో ఆ పార్టీ బలం పెరిగింది. కర్ణాటక సరిహద్దు జిల్లాలలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. కాస్తా కష్టపడితే బిఆర్ఎస్ ను దెబ్బతీయడం సులభమేనని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
పిల్ల పుట్టి తల్లి చచ్చినట్టు తెలంగాణ పుట్టి కాంగ్రెస్ చచ్చినట్టు మారింది. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా రెండు పర్యాయాలు బిఆర్ ఎస్ అధికారంలో రావడాన్ని కాంగ్రెస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇదిలా ఉండగా బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. తాము కూడా బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సోనియాగాంధీని ముఖ్య అతిథిగా హజరుఅయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్ రెండున హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటి సీఎం డికె శివకుమార్ ను ఈ సభకు రప్పించాలని చూస్తున్నారు.