తెలంగాణ టీడీపీలో చిచ్చు పెట్టిన కొత్త నియామకాలు
posted on Oct 1, 2015 2:30PM
తెలంగాణ తెలుగుదేశంలో మరో కొత్త చిచ్చు రాజుకుంది, ఇప్పటికే రేవంత్, ఎర్రబెల్లి మధ్య ఆధిపత్య పోరు పార్టీని ఇబ్బంది పెడుతుంటే, ఇప్పుడు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మధ్య పోరు మొదలైంది, వీరిద్దరి మధ్య ఎప్పట్నుంచో విభేదాలున్నా, చంద్రబాబు ప్రకటించిన కొత్త కమిటీలు దానికి మరింత ఆజ్యం పోశాయి, ఇప్పటివరకూ గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణ యాదవ్ ను టీటీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించి... మాగంటికి హైదరాబాద్ పగ్గాలు అప్పగించడంతో ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మధ్య ఎప్పట్నుంచో విభేదాలు ఉన్నాయి, ఎన్నోసార్లు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నారు, గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడిగా తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని కృష్ణ యాదవ్ కంప్లైంట్ చేస్తే, అందర్నీ కలుపుకొని పోవడం లేదని గోపీనాథ్ ఫిర్యాదు చేశారు. అయితే గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పదవి కోసం మాగంటి ప్రయత్నించడంతో వీరిద్దరి మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరాయి, తీరా ఇప్పుడు గోపీనాథ్ కి గ్రేటర్ పగ్గాలు అప్పగించడంతో కృష్ణ యాదవ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మాగంటికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది, హైదరాబాద్లో గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్న సీమాంధ్రులను సంతృప్తిపర్చడానికే ఆంధ్రా ప్రాంతానికి చెందిన మాగంటికి ఈ పదవి ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే మాగంటి నియామకంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కృష్ణ యాదవ్ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, గతంలోనూ ఓసారి ఇలాంటి ఆలోచన చేసిన కృష్ణ యాదవ్... చంద్రబాబు బుజ్జగించడంతో ఆగిపో్యారని, కానీ ఈసారి మాత్రం టీడీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని టాక్ వినిపిస్తోంది, అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని కృష్ణ యాదవ్ బహిరంగంగానే చెబుతున్నారు. అయితే తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న చంద్రబాబు...దీన్ని ఏవిధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.