ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట.
మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే!
ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది.
అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్ ని హ్యాపీగా గడిపేయండి.