విద్యానికేతన్ ను వదిలేసి వెళ్లిపోయిన మోహన్ బాబు?

జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబును అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు డిసెంబర్ 24తో ముగిసింది.

ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఇక ఏ క్షణంలోనైనా మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలింపు చర్యలకు సమాయత్తమౌతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేసి.. ఇప్పుడు ముందస్తు బెయిలు కోర్టు నిరాకరించినా మోహన్ బాబును అరెస్టు చేయకపోతే ప్రజలలో పలుచన అవుతామన్న భావనలో పోలీసులు ఉన్నారు.

అందుకే మోహన్ బాబు పరారీ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరి వెళ్లిన మోహన్ బాబు అక్కడ నుంచి బేంగళూరుకు వెళ్లారు. ఆ తరువాత తిరుపతి విద్యానికేతన్ కు చేరుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించినట్లు తెలిసిన వెంటనే సోమవారం సాయంత్రమే ఆయన ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విద్యానికేతన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన ఆనుపానులు ఎవరికీ తెలియలేదని అంటున్నారు.