లింగమనేని వర్సెస్ జగన్ సర్కార్... ఏపీలో కరకట్ట రాజకీయం...
posted on Sep 26, 2019 12:30PM

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసముంటోన్న లింగమనేని రమేష్ ఇల్లు కూల్చివేత నోటీసులపై వైసీపీ-టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తన ఇంటిని పక్కా నిబంధనలను పాటించే నిర్మించానని లింగమనేని చెబుతుంటే... రమేష్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. అంతేకాదు తన ఇంటిని కూల్చివేయవద్దంటూ సీఎం జగన్‌కు లింగమనేని లేఖ రాయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు.
కృష్ణా కరకట్టపై గెస్ట్ హౌస్ కూల్చివేతకు నోటీసులు ఇవ్వడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన లింగమనేని రమేష్.... అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకే, నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూల్చివేతల వల్ల తన ఒక్క కుటుంబమే ప్రభావితం కాదని, రాష్ట్ర ప్రజలందరూ అవుతారన్నారు. నిర్మాణాల కూల్చివేత... రాజధాని ప్రాంతంలో లక్షలాది మందిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసిందన్నారు. ఉండవల్లి అతిథిగృహానికి 2012లోనే చట్టపరంగా అన్ని అనుమతులతో పాటు ఇరిగేషన్ శాఖలోని కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నుంచి ఎన్‌వోసీ కూడా తీసుకున్నామని, 2014లో ఇక్కడి నుంచి పరిపాలన సాగించే ముఖ్యమంత్రికి అవసరమైన నివాసం లేకపోవడంతో కరకట్ట మీదున్న తన గెస్ట్ హౌస్‌ను అధికార నివాసానికి ఇచ్చానన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ, ఆర్థిక సంబంధిత ఆలోచనలు ఇందుల్లేవన్నారు.
లింగమనేని లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఘాటుగా రియాక్టయ్యారు. లేఖలో పేర్కొన్న విషయాలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. చంద్రబాబు వల్ల లబ్ది పొందకుంటే... తన ఇంటిని ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అక్రమంగా భవనాలు కట్టారు కాబట్టే... ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ లేఔట్లతో ప్రభుత్వ భూములను లింగమనేని ఎలా కొల్లగొట్టారో ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. మొత్తానికి కరకట్టపై కూల్చివేతల రాజకీయం రోజురోజుకీ హీటెక్కుతోంది. మరోవైపు లింగమనేని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.