లాలూ కౌగిలించుకుంటే అప్రదిష్ట అయితే మరి ఆయనతో కలిసి..
posted on Nov 23, 2015 7:45PM
నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి చాలా మంది అతిధులు వచ్చేరు. వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకరు. అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించే ఆయన అవినీతికి మారుపేరయిన లాలూ ప్రసాద్ యాదవ్ కి మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వబోతే, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనని బలవంతంగా కౌగిలించుకున్నారు. అది చూసి అందరూ చాలా నవ్వుకొన్నారు. వారి కౌగిలింత ఫోటోని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసేసి, దాని మీద ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు తెగ జోకులు వేసేసుకొని నవ్వుకొంటున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆయన కనబడినపుడల్లా విలేఖరులు ఆ కౌగిలింత వ్యవహారం గురించే గుచ్చి అడుగుతూ ఆయనకి చాలా కోపం తెప్పిస్తున్నారు. “నేను ఏదో మర్యాదపూర్వకంగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఆయనే నన్ను బలవంతంగా కౌగలించుకొన్నారు. అంత మాత్రాన్న నేను ఆయనను సమర్ధిస్తున్నట్లు కాదు,” అని అరవింద్ కేజ్రీవాల్ పాపం అందరికీ సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోంది.
లాలూ ప్రసాద్ యాదవ్ కి తన అవినీతి రికార్డు గురించి, ఆ కారణంగా తనపై జనాలకి తనపై ఉన్న అభిప్రాయం గురించి తెలియదనుకోలేము. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కి జనాలలో ఉన్న మంచి పేరు, అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం గురించి కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. తనతో కలిసి ఒకే వేదికపై నుండి ఎన్నికల ప్రచారం చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ అయిష్టత చూపినందునే బహుశః లాలూ ప్రసాద్ యాదవ్ ఈవిధంగా ఆయనపై చాలా స్వీట్ గా ప్రతీకారం తీర్చుకొన్నట్లుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ కౌగలించుకొంటేనే అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టకి భంగం కలుగుతున్నప్పుడు, కేజ్రీవాల్ లాగే చాలా నీతివంతుడు, అవినీతిని సహించనివాడని మంచి పేరున్న నితీష్ కుమార్ మరి అదే లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి ఐదేళ్ళు పరిపాలన సాగిస్తే ఏమవుతుందో? పైగా లాలూ తన కొడుకులు ఇద్దరినీ నితీష్ కుమార్ కి చెరో పక్క కాపలాగా పెట్టారు ఎక్కడికీ తప్పించుకొని పారిపోకుండా! అని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.