స్వామివారి లడ్డూకి పూర్వ వైభవం!

తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూ అన్నా, దాని పవిత్రత అన్నా, దాని రుచి అన్నా మీకు ఎంతో ఇష్టం కదూ? తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూ తయారీలో ఉపయోగించారని ఇటీవల వచ్చిన వార్తలు విని మీరు చాలా బాధపడే వుంటారు. తిరుమలలో ఎన్నో అవినీతి, అక్రమ కార్యకలాపాలు చేసిన ఈ దుర్మార్గులు చివరికి స్వామివారి లడ్డూని కూడా వదల్లేదా అని మీకు కోపం వచ్చింది  కదూ! ఈ ఐదేళ్ళుగా ఎంతో భక్తిగా, ప్రేమగా స్వీకరించిన లడ్డూ ప్రసాదం వెనుక ఇంత కుట్ర జరిగిందని మీకు బాధకలిగే వుంటుంది. స్వామివారికి జరిగిన అపచారం మీకు తీవ్ర మనోవేదన కలిగించే వుంటుంది. అయితే, ఇక అలా బాధపడాల్సిన అవసరమే లేదండీ.. పరిస్థితితో మార్పు వచ్చింది. తిరుమల లడ్డూకి పవిత్రత మళ్ళీ సమకూరింది. తిరుమల లడ్డూ విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు.

అలాగే శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ అధికారులు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ ప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా లడ్డూ తయారీ జరిగే పోటులో ప్రోక్షణ జరిగింది. స్వామివారికి మహా నైవేద్యం నిర్వహించారు. ఇక భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ ఈఓ శ్యామలరావు భరోసా ఇస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమ నిర్వహణతో అన్ని దోషాలూ తొలగుతాయని ఆయన వివరించారు. గతంలో వున్న నెయ్యి మొత్తాన్నీ తొలగించామని తెలిపారు.