జగన్ నెత్తిన లడ్డూ బాంబు!?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతీయ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి జాతీయ మీడియా కూడా లడ్డూ వ్యవహారంపైనే ఫోకస్ చేసింది.  లడ్డూ వివాదంపై జగన్ మీడియా ముందుకు వచ్చి రాజకీయ విమర్శలు గుప్పించినా కూడా లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం  జగన్ పాలనలోనే జరిగిందని జనం నమ్ముతున్నారు. జగన్ కౌంటర్ అటాక్ ను పట్టించుకున్న వారే లేరు. చివరాఖరికి వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాజకీయ విమర్శలను నమ్మడం లేదు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలకు హిందూ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదనీ, అందుకే కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నా పట్టించుకోలేదనే విశ్వసిస్తున్నారు. దీంతో లడ్డూ వివాదం నుంచి ఎలా బయటపడాలో, అసలీ వివాదంపై ఎలా స్పందించాలో కూడా తెలియక వైసీపీ నేతలు, శ్రేణులు చేష్టలుడిగాపోయాయి. రాజకీయంగానే కాదు, నైతికంగా కూడా వైసీపీ ప్రతిష్ట అధ: పాతాళానికి పడిపోయిందనడంలో సందేహం లేదు. 

మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాలపై లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం జగన్ కు, ఆయన పార్టీకీ తీరని నష్టం చేసిందని అంతా భావిస్తున్నారు కానీ, లడ్డూ ప్రసాదంలో కల్తీ ఎఫెక్ట్ అంత కంటే లోతుగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ మీడియా ముందుకు వచ్చి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో చేసిన రాజకీయ విమర్శలు పూర్తిగా నిరుపయోగం అవ్వడమే కాకుండా.. కచ్చితంగా జగన్ హయాంలోనే ఈ కల్తీ జరిగిందన్నది ప్రజలకు నిర్ధారణ చేశాయి. ఇది వైసీపీకి రాజకీయంగా తీరని నష్టం కలిగించిందనడంలో సందేహం లేదు. కేవలం నష్టమే కాకుండా ఆ పార్టీకి రాజకీయ ఉనికిని కూడా ప్రశ్నార్థకం చేసే రేంజ్ లో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ప్రజలలో ఆగ్రహావేశాలను నింపింది. 

లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయన్న సంగతి వెలుగు చూడగానే వైసీపీలో మేధావులుగా పరిగణింపబడుతున్న వారు దీని వల్ల పార్టీకి జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలు వేయడం ప్రారంభించారు. జగన్  మీడియా సమావేశం కారణంగా మరింత డ్యామేజి జరిగింది తప్ప పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వారు నిర్ధారణకు వచ్చారు. కల్తీ జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు కానీ దానిని బయటపెట్టి తిరుమల దేవుని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారా అంటూ జగన్ మీడియా సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం వైసీపీకి బూమరాంగ్ అయ్యింది. జగనే స్వయంగా కల్తీ జరిగినట్లు అంగీకరించినట్లైంది. 

ఇక ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి వాటిల్లిన, వాటిల్లబోయే నష్టం విషయానికి వచ్చే ముందు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేసిన బీజేపీ.. ఆ తరువాత కొద్ది కాలానికే అప్పటి ప్రతిపక్షమైన వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల నాటికి పరోక్షంగా జగన్ కు అన్ని విధాలుగా పరోక్ష సహకారం అందించింది.  మళ్లీ 2024 ఎన్నికలు వచ్చే సరికి తెలుగుదేశంతో జట్టు కట్టింది. అంటే రాష్ట్రంలో కనీస బలం కూడా లేని బీజేపీ తన అవసరాలు, పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. అన్నిటికీ మించి తన రాజకీయ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్ ను ఒక లేబొరేటరీలా వాడుకుంటోంది. ఈ  ప్రయోగాల కారణంగా ఏపీ ఏ గంగలో కలిసినా ఫర్యాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.  

అయితే ఇక ఇప్పుడు అంటే లడ్డూ వివాదం తరువాత ఆ పార్టీకి ఆ అవకాశం ఇసుమంతైనా లేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసమైనా.. జగన్ కు మద్దతు, సహకారం అందించే పరిస్థితి ఇప్పుడే కాదు మరెప్పుడూ తలెత్తే అవకాశం లేదు. హిందూత్వను భుజాన వేసుకునే బీజేపీ ఇప్పుడు అనివార్యంగా మిగిలిన అన్ని పార్టీల కంటే ఎక్కువగా జగన్ పై విమర్శలు గుప్పించి, జగన్ తిరుమల తిరుపతికి చేసిన అపచారాన్ని ఎండగట్టక తప్పని పరిస్థితి లడ్డూ వివాదం కారణంగా ఏర్పడింది. 
చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వెనుక ఉన్నది వైసీపీయేనని సందేహాలకు అతీతంగా ఎస్టాబ్లిష్ చేశారు. దేవుడికి జరిగిన మహాపచారంలో వైసీపీ ప్రమేయం ఉందని నిరూపించేశారు. దీంతో వైసీపీకి బీజేపీ ద్వారాలు శాశ్వతంగా మూతపడేలా చేశారు. జగన్ తో ఏ రకంగానైనా సంబంధాలు కొనసాగిస్తే బీజేపీ దేశ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహానికి గురౌతుంది. ఆ కారణంగానే బీజేపీ ద్వారాలు జగన్ కు ఇక ఎప్పటికీ తెరుచుకునే పరిస్థితి లేదు. 

ఆ సంకేతాలు ఇప్పటికే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వద్ద బీజేపీ ధర్నా జరగడాన్ని చెప్పవచ్చే. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు నేతలు వైసీపీపై జగన్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతొ ఇక వైసీపీ ఎప్పటికీ బీజేపీకి అంటరాని పార్టీగా మారిపోయిందనే చెప్పాలి.  అంటే జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ స్పీడందుకుంటుందన్నమాట. జగన్ లో ఇప్పటికే ఆ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.