బావ,బామ్మర్దుల ఆధిపత్య పోరు: రేవంత్ ఆజ్యం !!

బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది.పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా కేటీఆర్,నెంబర్ త్రీగా హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు.ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే! అయితే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థంగా 'పెర్ఫార్మ్' చేయడం లేదని కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు విమర్శిస్తున్నారు.పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ లో మునుపటి గర్వం,అహంకారం తగ్గడం లేదని అంటున్నారు.పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

కేటీఆర్ వైఫల్యాలను హరీశ్ తనకు అనుకూలంగా మలచుకొని దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వంపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన పెద్ద ఎత్తున విరుచుపడుతున్నారు.ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్దత,నిరాశా నిస్పృహలను తొలగించేందుకు హరీశ్ రావు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.బావ,బామ్మర్దుల మధ్య జరుగుతున్న 'పోరాటం'తో పార్టీ అధినేత కేసీఆర్ మరుగునపడి పోతున్నారు.కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం హరీశ్ రావుకు కలిసి వచ్చినట్టు చెబుతున్నారు.2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నడచిన హరీశ్ రావు,తెలంగాణ ప్రభుత్వంలోనూ తన మేనమామకు వెన్నుదన్నుగా ఉన్నారు.కేటీఆర్ మంత్రిగా మంచి మార్కులు సంపాదించినా,హరీశ్ రావు ప్రాబల్యానికి గండి కొట్టే చర్యలు అనేకం చేసినట్టు  ఆయనపై ఆరోపణలున్నవి.

ఇద్దరి మధ్య జగడం 2014 నుంచి కొనసాగుతున్నది.అధికారం కోల్పోయాక అది ఉధృతమైనట్టు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి టర్మ్ లోనే బావ,బామ్మర్దుల మధ్య  'ఆధిపత్య' పోరుకు బీజం పడింది.అప్పట్లో 'కేసీఆర్ తర్వాత సీఎం మా అన్న కేటీఆర్' అని ఎమ్మెల్సీ కవిత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య హరీశ్ రావుకు ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.అదే రోజు హరీశ్ రావు కేసీఆర్ నివాసానికి వెళ్ళి,కేటీఆర్,కవిత,సంతోష్... ఇతర కుటుంబసభ్యులతో 'ఘర్షణ'కు దిగారని బిఆర్ఎస్ నాయకులంటున్నారు.అది సద్దుమణిగినా ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణంకొంత కాలం కొనసాగింది.

బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో నాటి మంత్రి హరీశ్ రావు క్వార్టర్ దగ్గర 'స్పెషల్ బ్రాంచ్' పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టడం,ఆ విషయాన్ని హరీశ్ రావు గుర్తించి కేటీఆర్ తో గొడవ పెట్టుకోవడం,నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు ఈ పంచాయతీ వెళ్లడం,ఇద్దరినీ ఆయన నచ్చచెప్పడం... వంటి  ఘటనలను కొందరు బిఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.హరీశ్ రావును ఎవరెవరు కలుస్తున్నారో 'ఆరా' తీయడానికి కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ కు ఆదేశాలు అందినట్టు అప్పట్లో ఒక ప్రచారం జరిగింది.కేటీఆర్ ఆదేశాలతోనే  తనపైన నిఘా పెట్టినట్టు హరీశ్ రావు అనుమానించినందువల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని తెలిసింది.

అలాగే ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు 'డిస్టింక్షన్' మార్కులు సంపాదించడంతో కేటీఆర్ లో అసూయ పెరిగిందన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.పైగా టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా,నాయకునిగా హరీశ్ కు గుర్తింపు ఉంది.ఆ గుర్తింపే పార్టీపై ఆయన  పట్టు పెరగడానికి కారణమైంది.కానీ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారునిగా కేటీఆర్ కు తగిన గౌరవం లభించింది తప్ప అది ఆయన 'కష్టార్జితం' కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉన్నది.ఐటి,పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ సక్సెస్ కావడం వెనుక తన కృషితో పాటు  కొందరు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు శక్తివంచన లేకుండా పనిచేశారని చెబుతున్నారు.  

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది.ఈ పోరాటంలో ఆజ్యం పోయడానికి సీఎం రేవంత్  రెడ్డి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.బిఆర్ఎస్ లో 'అంతా తానే' అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టడానికి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల హరీశ్ రావుకు కలిసి వచ్చిందంటున్నారు.ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే కేటీఆర్ మరింత రెచ్చిపోయేవారని,హరీశ్ కు మంత్రి పదవి కూడా రాకుండా చేసే వారన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది.  

కాగా కేటీఆర్ ప్రభావాన్ని అటు బిఆర్ఎస్ లోనూ,జనాల్లోనూ తగ్గించాలన్నది  రేవంత్ ఎత్తుగడ. కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో హరీష్ రావు విమర్శలకు  కౌంటర్ ఇస్తుండడాన్ని గమనించవచ్చు.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో సహజంగానే ప్రతిపక్ష శిబిరంలో హరీష్ రావు హైలెట్ అవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పట్టించుకోకుండా హరీష్ రావు పైనే విమర్శలు చేయడం,ఆయనకే సవాళ్లు విసరడం వెనుక రేవంత్ రెడ్డి
వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చు.తనకు కేసీఆర్ లేదా హరీశ్ తప్ప కేటీఆర్ పోటీదారు కాదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను 'మేనేజ్మెంట్ కోటా'అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా  కేటీఆర్ విమర్శలకు,సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు. కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నవి.కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా తాను  టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మైలేజ్ రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు.  హరీష్ రావును హైలైట్ చేయడం వల్ల ఆయనకు పాపులారిటీ రావడంతో పాటు,బావ బామ్మర్దుల మధ్య  వైరం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

-ఎస్.కే.జకీర్ (సీనియర్ జర్నలిస్ట్)