పెద్దిరెడ్డి, ఆర్కే రోజా దర్శనం టిక్కెట్ల స్కామ్!

జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని ఆయన విమర్శించారు. దైవసేవ సేవచేయాల్సిన మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్ పార్టీ నాయకుల సేవలో తరించారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. "పర్యాటకశాఖకు ప్రతిరోజూ 1000 దర్శనం టికెట్లు ఇస్తారు. వాటిలో 800 టికెట్లు మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో నిర్వహించే 'కళాధర్ ట్రావెల్స్'కి ఇచ్చేవారు. హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, గంగావతి ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఈ టికెట్లు అమ్మేవారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్.కి మాత్రమే  అన్ని టికెట్లు ఇవ్వడంలో రహస్యం, అంతర్యం ఏమిటి?" అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ 800 టికెట్లను రద్దీని బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకూ అమ్మేవారని వర్ల ఆరోపించారు.  ఒక్క కళాధర్ ట్రావెల్స్ వారికే అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి? అని వర్ల ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు పర్యాటక శాఖ మంత్రి రోజా విషయానికి వస్తే.. నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో అందినంత డబ్బు దండుకోవడం మాత్రమే కాదు. ఎమ్మెల్యేగా వున్నప్పుడు కూడా నెలనెలా లక్షలాది రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకునే వారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు నెలకు ఒకసారి  ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా, ఆ ఒక్క సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను భారీ సంఖ్యలో అనుమతించేవారు. ప్రోటోకాల్ దర్శనం టిక్కెట్ ధర బ్లాక్ మార్కెట్‌లో ఒక్కొక్కటి 20 వేల వరకు కూడా పలుకుతూ వుంటుంది. ఈ టికెట్లను తాను ఏర్పాటు చేసుకున్న దళారీ ఉద్యోగుల ద్వారా రోజా విక్రయించి దండుకునేవారని ఆరోపణలున్నాయి. అలాగే బుక్ మై దర్శన్ పోర్టల్ ద్వారా కూడా టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు.